TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సౌదీ అరేబియాపై హౌతీల కొత్త వ్యూహం: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు పత్రాలతో వ్యతిరేక ప్రచార యుద్ధం.!

Published on: Sat Oct 24, 2026 9:20AM

యెమెన్ ను  తమ గుప్పిట్లో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పుడు సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని సరికొత్త వ్యూహానికి తెరలేపారు. సాధారణంగా క్షిపణులు, డ్రోన్లు వంటి ఆయుధాలతో విరుచుకుపడే హౌతీ తిరుగుబాటుదారులు, ఈసారి శక్తిమంతమైన ప్రచార అస్త్రాన్ని ప్రయోగించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అమెరికన్ సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కేసు పత్రాలను ఆధారం చేసుకుని సౌదీ అరేబియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు  ప్రయత్నాలు మొదలెట్టారు.

గత కొంతకాలంగా అమెరికా న్యాయ శాఖ బహిర్గతం చేసిన ఎప్‌స్టీన్ దర్యాప్తు పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ఈ నివేదికలు,  పత్రాల్లో పేర్కొన్న కొన్ని కీలక అంశాలను హౌతీలు తమ రాజకీయ లబ్ధి కోసం   వాడుకుంటున్నారు. ముఖ్యంగా సౌదీ రాజకుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు కొందరు దివంగత ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఇస్లాం మత పవిత్ర స్థలమైన మక్కాలోని  కాబా  అలంకరణ వస్త్రాలను బహుమతిగా సమర్పించారనే ఆరోపణలను హౌతీలు    తెరపైకి తెచ్చారు. ఈ సున్నితమైన అంశాన్ని సోషల్ మీడియా వేదికగా  ప్రచారం చేస్తూ సౌదీ పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తమను తాము నిజమైన ఇస్లాం మత రక్షకులుగా, సాంప్రదాయ పరిరక్షకులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న హౌతీలు.. సౌదీ అరేబియా నాయకత్వం ఇస్లాం పవిత్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే   భావనను ముస్లింలలో వ్యాప్తి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.   సాధారణ సామాజిక మాధ్యమాలే కాకుండా, ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రత్యేక డిజిటల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఈ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రతిష్టను అంతర్జాతీయ వేదికలపై దిగజార్చడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రచార యుద్ధాన్ని హౌతీలు చేపట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

యెమెన్ అధికార ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న సౌదీ అరేబియాపై ఇప్పటికే పలుమార్లు సైనిక దాడులకు పాల్పడిన హౌతీలు, ఇప్పుడు దాడులతో పాటు  సౌదీ ప్రతిష్ఠ దిగజార్చేందుకు ప్రచార యుద్ధాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ పరిణామం  కలకలం రేపుతోంది. అమెరికా పత్రాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థి దేశంపై బురదజల్లే ప్రయత్నం చేయడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్య పోరును  హౌతీలు తీవ్రతరం చేశారని పరిశీలకులు అంటున్నారు. 

మతపరమైన మనోభావాలను ముడిపెట్టి సాగిస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు   సౌదీ అరేబియా   వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డిజిటల్ యుగంలో ఆయుధాల కంటే సమాచార పంపిణీ, తప్పుడు ప్రచారాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయనడానికి  హౌతీల ప్రచార యుద్ధం తాజా ఉదాహరణగా చెబుతున్నారు.  

[Houthis New Wepon To Demoralise Saudi Arabia, Jeffrey Epstein case, Yemen Rebels, Middle East Politics, Telugu One]