రియాద్ ఎయిర్ పోర్టుపై హౌతీల దాడి: వరుస దాడులతో కలకలం.!
Published on: Mon Oct 12, 2026 11:18AM

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా రెండవ రోజూ హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వరుస దాడులతో ప్రయాణికులు, విమానయాన సంస్థలు వణికిపోతున్నాయి. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆదివారం (అక్టోబర్ 11)న జరిగిన దాడిలో ప్రయాణికుల హాల్‌లో మంటలు చెలరేగినట్లు సైనిక వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. శనివారం (అక్టోబర్ 10) కూడా ఇదే ప్రాంతంలో హోతీ తిరుగుబాటు దారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ప్రాణ నష్టం కూడా సంభవించింది.
యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ ఈ వరుస దాడిలు తమ పనేనని బహిరంగంగా ప్రకటించింది. గత ఇరవై నాలుగు గంటల్లో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్లను ఉపయోగించి ఎయిర్‌పోర్టును టార్గెట్ చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ ప్రకటించారు. సౌదీ గగనతలాన్ని, విమానాశ్రయాలను ఎవరూ ఉపయోగించవద్దని విస్పష్ట హెచ్చరిక కూడా జారీ చేశారు.
రియాద్‌తో పాటు డామామ్ ఎయిర్‌పోర్టు, పలు చమురు నిల్వ కేంద్రాలను కూడా తమ బలగాలు ధ్వంసం చేశాయని హౌతీలు ప్రకటించారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ ఇస్తున్న మద్దతుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మక్కా, మదీనా మినహా సౌదీలోని అన్ని విమానా శ్రయాలు తమ తదుపరి లక్ష్యాల జాబితాలో ఉన్నాయని హౌతీలు ప్రకటించారు.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. హౌతీల దాడులపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. బ్రిటన్ రక్షణ మంత్రి వెస్ స్ట్రీటింగ్ సౌదీ అరేబియాకు రక్షణ పరంగా మరింత సహాయం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
[Houthi Attack Saudi Arabia airport, Houthi MissileStrike Riyadh, King Khalid International Airport, Yemen Conflict, Telugu One]


