టీ, కాఫీలు ఏ ఉష్ణోగ్రతలో తాగితే ఆరోగ్యానికి సురక్షితం?
Published on: Sat Nov 7, 2026 9:17AM

చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. కొందరైతే కప్పులో నుంచి ఆవిరి వస్తున్నప్పుడే ఆస్వాదిస్తూ తాగుతుంటారు. టీ చల్లారిపోతే రుచి తగ్గుతుందని, వేడిగా ఉంటేనే బాగుంటుందని భావిస్తారు. అయితే ఇలా మరీ వేడిగా ఉన్న పానీయాలను ప్రతిరోజూ తాగే అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని తాజా వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారాన్ని నోటి నుంచి కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహికపై ఈ అధిక వేడి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
టీ లేదా కాఫీ తాగడమే ఇక్కడ అసలు సమస్య కాదు, వాటిని ఎంత వేడిగా తాగుతున్నామన్నదే ముఖ్యం. పదేపదే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను తీసుకోవడం వల్ల అన్నవాహిక లోపలి పొర దెబ్బతింటుంది. కాలక్రమేణా ఇది ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఎంత ఉష్ణోగ్రత ఉన్న పానీయాలు ప్రమాదకరం, ఆహార నాళానికి నష్టం ఎలా కలుగుతుంది అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.
మన నోటి నుంచి ఆహారం, ద్రవాలను కడుపులోకి చేరవేసే కండరాలతో కూడిన గొట్టంలాంటి భాగాన్ని అన్నవాహిక లేదా ఈసోఫేగస్ అంటారు. దీని లోపలి ఉపరితలంపై సున్నితమైన శ్లేష్మ పొర ఉంటుంది, ఇది అన్నవాహికను రక్షిస్తుంది. మనం పదేపదే మరీ వేడిగా ఉన్న టీ, కాఫీలను తాగినప్పుడు ఆ తీవ్రమైన వేడి ఈ రక్షణ పొరను తీవ్రంగా గాయపరుస్తుంది. శరీరం దెబ్బతిన్న కణాలను తిరిగి బాగు చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, తరచూ అధిక వేడికి గురికావడం వల్ల కణాలు దెబ్బతినడం, వాపు రావడం పదేపదే జరుగుతుంది. దీర్ఘకాలంలో కణాల్లో అసాధారణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను తాగడాన్ని మానవులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న అంశంగా వర్గీకరించింది. దీనిని గ్రూప్ 2A కింద పేర్కొన్నారు. అంటే అత్యంత వేడి పానీయాలు అన్నవాహిక పొలుసుల కణ క్యాన్సర్తో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధనల్లో ఆధారాలు ఉన్నాయి. అయితే 65 డిగ్రీలు దాటిన పానీయం ఒక్కసారి తాగినంత మాత్రాన క్యాన్సర్ రాదని, పదేపదే ఆ అలవాటు ఉండటమే ప్రమాదకరమని వైద్యులు తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి:పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
ఈ విషయాలు తెలిసిన తర్వాత చాలామందికి టీ, కాఫీలు పూర్తిగా మానేయాలా అనే సందేహం కలుగుతుంది. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు; ప్రధాన సమస్య టీ, కాఫీలలో ఉండే పదార్థాలు కాదు, వాటిని అత్యంత వేడిగా తాగడమే. కాబట్టి పానీయం తయారు చేసిన వెంటనే తాగకుండా కొద్దిసేపు చల్లారనివ్వాలి. నోరు, నాలుక లేదా గొంతు కాలేంత వేడిగా ఉన్నప్పుడు తీసుకోకుండా, మీకు సౌకర్యంగా అనిపించేంత వెచ్చగా మారిన తర్వాతే తాగడం ఎప్పుడూ శ్రేయస్కరం.

మరీ వేడిగా ఉండే పానీయాలు ఒక్కటే అన్నవాహిక క్యాన్సర్కు కారణం కావు. పొగాకు వినియోగం, మద్యపానం ఈ క్యాన్సర్కు గుర్తించిన ఇతర ముఖ్యమైన ప్రమాద కారకాలు. వయస్సు పెరగడం, దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉండటం కూడా ముప్పును పెంచుతాయి. ఆహారం మింగడంలో ఇబ్బంది కలగడం, కారణం తెలియకుండా బరువు తగ్గడం లేదా ఛాతీలో నిరంతర నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీకు నచ్చవచ్చు:లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!
గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!
Hot Tea And Coffee Risks, Dangers Of Scalding Hot Drinks, Health Warning Hot Beverages, Esophageal Health Tips, Coffee And Tea Side Effects, Doctor Health Advice, Health Tips In Telugu.


