అర్నాబ్ తుపాన్: ఉత్తరాంధ్రలో విద్యాసంస్థలకు సెలవులు.!
Published on: Tue Oct 27, 2026 9:28AM

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న పెను తుపాను అర్నాబ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. పెను తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. సముద్రతీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు వేగవంతం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
.webp)
వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్స్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది.
[Holidays To Educationa Inistitutions, Arnab Cyclone, North Andhra Rains, Cyclone Alert, Telugu One]


