TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చదువు లేని హిట్లర్: డాక్టరేట్ గోబెల్స్: భక్తి రాజకీయం నేటికీ మారలేదు.!

Published on: Mon Nov 23, 2026 2:11PM

 డిగ్రీలు ఇచ్చేది విద్య..  ప్రశ్నించే తత్వం ఇచ్చేది వివేకం. ఆ రెండూ వేరు అని మరచిన ప్రతి సమాజం, తన లోపల ఒక గోబెల్స్ ను తయారు చేసుకుంటుంది. అందుకే  పాఠశాల విద్యను పూర్తి చేయని హిట్లర్, హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పొందిన గోబెల్స్..  ఇద్దరి మధ్య నిజమైన వైరుధ్యం చదువు కాదు, విధేయత. గోబెల్స్కు విద్య ఉంది, మేధస్సు ఉంది. అయితే తాను నమ్ముతున్నది నిజమా  అబద్ధమా అని ప్రశ్నించుకునే ధైర్యం, విచక్షణ లేదు.   ప్రచార యంత్రం ఒక అబద్ధాన్ని వేయిసార్లు చెప్పి నిజంగా మార్చగలిగినప్పుడు..  ఓటు హక్కు కూడా ప్రమాదకర ఆయుధమే  అవుతుంది.  తెలుగు రాష్ట్రాలతో సహా దేశం నిండా నాయకుడే పార్టీ, నాయకుడి మాటే వేదం. ఆ నాయకుడిని విమర్శించడమంటే దేశద్రోహం అన్న భావన బలపడుతోంది. 2024 సార్వర్తిక ఎన్నికలలో  గెలిచిన ఎంపీలలో   19 శాతం మంది, అసెంబ్లీల్లో 35 శాతం మంది ఎమ్మెల్యేలు తమ చదువు ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్య ఉందని అఫిడవిట్లో ప్రకటించారు.  ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, వ్యవస్థ సమస్య. ఎన్నికల అఫిడవిట్లో రాసిన విద్యార్హతకూ, బహిరంగ వేదికలపై చెప్పే మాటలకూ మధ్య ఉన్న దూరం ఒక ప్రజాస్వామిక ప్రశ్న. పూజించడం ఆపి ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే మార్పు మొదలవుతుంది. అంతకంటే ముందు కాదు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అవినీతి కాదు, అసమర్థత కాదు, పార్టీల మధ్య పోటీ కూడా కాదు. చదువుకున్నవారు కూడా ప్రశ్నించడం మానేసి, ఒక వ్యక్తిని సర్వజ్ఞుడిగా భావించి పూజించడం మొదలుపెట్టినప్పుడే నిజమైన ముప్పు మొదలవుతుంది. ఈ పాఠాన్ని మానవ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఉదాహరణ ఒకటి, ఎనభై ఏళ్ల తర్వాత కూడా మన ముందు పెడుతోంది.  హిట్లర్, గోబెల్స్. వీరిలో ఒకరు  పాఠశాల విద్య కూడా పూర్తి చేయలేదు.   మరొకరు ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో చదివి పీహెచ్ డీ  పొందారు. చదువు తక్కువ ఉన్నవాడు నాయకుడయ్యాడు, చదువు ఎక్కువ ఉన్నవాడు అతడి ప్రచార యంత్రానికి వెన్నెముకగా నిలిచాడు. ఇది గతం గురించిన కథ మాత్రమే కాదు..  ఇది ఈ రోజు భారత రాజకీయ వాతావరణం గురించిన ప్రశ్న కూడా.

అడాల్ఫ్ హిట్లర్ 1889లో ఆస్ట్రియాలో పుట్టాడు. 1905లో, పదహారేళ్ల వయసులో లింజ్లోని పాఠశాలను ఎలాంటి ఉత్తీర్ణత పత్రమూ లేకుండా విడిచిపెట్టాడు. అతడి అధికారిక విద్య అక్కడితో ముగిసింది. తర్వాత వియన్నాలో చిత్రకారుడిగా ప్రయత్నించి రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాడు. ఆ తర్వాత అతడు నిర్మించుకున్నది విద్యను కాదు..  ఒక భావజాలాన్ని.  తనను అవమానించిన ప్రపంచం మీద పగ తీర్చుకునే భావజాలాన్ని. 1919లో నాజీ పార్టీలో చేరి, 1933 జనవరి 30న జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. జోసెఫ్ గోబెల్స్ 1897లో పుట్టాడు. కుడికాలిలో పుట్టుకతో వచ్చిన వైకల్యం ఉండటంతో మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేరలేకపోయాడు.  జీవితాంతం అతడిని వెంటాడిన న్యూనతా భావానికి అది మూలం. కానీ చదువులో అతడు ముందుండేవాడు. బాన్, ఫ్రైబర్గ్, వుర్జ్బర్గ్, మ్యూనిచ్, హైడెల్బర్గ్..ఇలా జర్మనీలోని  ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదివి, 1921లో హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.   తన జీవితాన్ని మరొకరి అబద్ధాలను నిజంగా మార్చే పనికి అంకితం చేశాడు. ఇక్కడే ఆ  చిత్రమైన వైరుధ్యం మొదలవుతుంది. చదువు లేని హిట్లర్ కు, ఇన్ని డిగ్రీలు ఉన్న  డాక్టరేట్ పొందిన గోబెల్స్ జీవితాంతం గుడ్డి భక్తుడిగా మారిపోయాడు. హిట్లర్ ఏం చెప్పినా సమర్థించడం, అతడు చేసే తప్పులను కప్పిపుచ్చడం, అతడి అబద్ధాలను నిజాలుగా ప్రజలను నమ్మించడం గోబెల్స్ పని అయింది. కేవలం మాటలతోనే కాకుండా రేడియో, పత్రికలు, సినిమాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు.. ఇలా  అప్పటికి అందుబాటులో ఉన్న ప్రతి ప్రచార మాధ్యమాన్ని ఉపయోగించి నాజీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. యూదులపై ద్వేషాన్ని పెంచడంలో, హిట్లర్ నియంతృత్వాన్ని సమర్థించడంలో కీలక పాత్ర పోషించాడు. గోబెల్స్  విద్య ఉంది, డాక్టరేట్ ఉంది, మేధస్సు ఉంది. కానీ ఆలోచనలను ప్రశ్నించడానికి ఉపయోగించాల్సిన విద్యను అతడు హిట్లర్ భజనకు ఉపయోగించాడు. నిజాన్ని తెలుసుకోవాల్సిన మేధస్సును అబద్ధాలను ప్రచారం చేయడానికి ఉపయోగించాడు. 1933 మే 10న బెర్లిన్లో పుస్తకాలు కాల్చినప్పుడు, నూరేళ్ల కిందట హెన్రిచ్ హైనె రాసిన మాట నిజమైంది. ఎక్కడ పుస్తకాలను కాలుస్తారో, చివరికి అక్కడ మనుషులను కూడా కాలుస్తారు. ఆ మాటను నిజం చేయడంలో గోబెల్స్ ప్రచార యంత్రం పాత్ర ప్రధానం.

 

చివరకు 1945 ఏప్రిల్ 30న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తర్వాత గోబెల్స్ కేవలం ఒక్కరోజు మాత్రమే జర్మనీ ఫ్యూరర్గా కొనసాగాడు. మే 1న తన భార్య మాగ్డాతో కలిసి తమ ఆరుగురు పిల్లలకు విషమిచ్చి చంపి.. అనంతరం ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. గోబెల్స్ కు భార్య మొదటి వివాహం ద్వారా పుట్టిన కుమారుడు హరాల్డ్ క్వాంట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి వారసుల కుటుంబం  నేటికీ జర్మనీలో అత్యంత సంపన్న పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటి. బీఎండబ్ల్యులో క్వాంట్ కుటుంబానికి ఉన్న వాటా వారి సంపదలో కీలక భాగం. చరిత్ర శిక్ష విధించినా, ఆస్తి మాత్రం వారసత్వంగా కొనసాగుతూనే ఉంది.  ఇది కూడా ఒక పాఠం.

ఇది కూడా చదవండి:   గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!


గోబెల్స్ ప్రచార పద్ధతులను ఇప్పుడు పరిలోకిస్తే..   అవి పాతబడలేదని అర్థమవుతుంది. ఒకే మాటను పదే పదే చెప్పడం. సంక్లిష్టమైన సమస్యను ఒకే శత్రువుగా మార్చడం.  ప్రతి విమర్శను దేశ ద్రోహంగా ముద్ర వేయడం.  భావోద్వేగాన్ని వాస్తవానికి బదులుగా ఉంచడం. ఇవి ఎనభై ఏళ్ల క్రితం రేడియోలో పనిచేసిన సూత్రాలే.  ఈ రోజు టెలివిజన్ డిబేట్లలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ రీల్స్ లో రీల్స్ లొ,  ఫ్యాన్ ఆర్మీల ట్విట్టర్ ఖాతాల్లో   పనిచేస్తున్నాయి. మారినది సాధనం మాత్రమే.. స్వభావం కాదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాజకీయ సమతుల్యత పేరుతో వాస్తవాలను నీరుగార్చే సంప్రదాయం మన మీడియాలో బలంగా ఉంది. కానీ నిజాన్ని నిజంగానే చెప్పాల్సిన సమయం ఇది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశం నిండా ఒక నాయకుడి చుట్టూ మూడు శక్తులు ఒకటిగా మారుతున్నాయి. కుల గుర్తింపు, సినిమా లేదా క్రీడా అభిమానుల సంఘం, పార్టీ. ఈ మూడూ కలిసినప్పుడు నాయకుడి మీద విమర్శ అనేది వ్యక్తిగత దాడిగా మారిపోతుంది. ప్రశ్న వేసిన వారి ఇళ్లకు వెళ్లి రాళ్లు విసిరే సంస్కృతి పెరిగింది. ఇది రాజకీయ ఉద్వేగం కాదు; ఇది ప్రజాస్వామ్య హత్య. ఇక్కడే గోబెల్స్ ప్రశ్న మళ్లీ మన ముందుకు వస్తుంది. చదువు లేని నాయకుడు ఉండవచ్చు అది నేరం కాదు. కానీ ఆ నాయకుడి వెనుక నిలబడి, అతడు చేసిన ప్రతి పనినీ సమర్థిస్తూ, అతడి అబద్ధాలను నిజాలుగా ప్రజలను నమ్మించే ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వారే నిజమైన సమస్య. వారు డాక్టరేట్లు పొందినవారైనా, విద్యాసంస్థలు నడిపేవారైనా, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారైనా.. ప్రశ్న లేని చోట విద్య కేవలం అలంకారంగానే మిగిలిపోతుంది. 

ఇది ఏదో ఒక వ్యక్తి కథ కాదు.. దేశం నిండా కనిపించే ఒక నమూనా.  2002లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, 2003 నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన విద్యార్హత, ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలను ఫారం 26 అఫిడవిట్లో ప్రకటించడం తప్పనిసరి అయింది. అంటే ఇక్కడ ఊహలకు, వదంతులకు తావు లేదు.  అధికారిక పత్రాలే మన ముందున్నాయి. ఆ పత్రాలేం చెబుతున్నాయో చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 543 మందిలో 105 మంది (19 శాతం) తమ విద్యార్హతను ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్య ఉందని ప్రకటించారు. అందులో 65 మంది ఇంటర్మీడియట్, 34 మంది పదో తరగతి, నలుగురు ఎనిమిదో తరగతి, ఇద్దరు ఐదో తరగతి. ఒకరు తాము  అక్షరాస్యులు అని మాత్రమే అని రాశారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ చిత్రం మరింత స్పష్టంగా ఉంది. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించినప్పుడు, 1,387 మంది (దాదాపు 35 శాతం.. డిప్లొమా పొందినవారితో కలిపి) ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్య చదివారనీ, 55 మంది ఐదో తరగతి కూడా పూర్తి చేయలేదని తేలింది. అంటే మన పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ కూడా   మూడో వంతు మంది ప్రజాప్రతినిధుల విద్యార్హత  విషయంలో పాఠశాల విద్య మాత్రమే.  ఈ సంఖ్యలు ఏ ఒక్క రాష్ట్రానికీ, ఏ ఒక్క పార్టీకీ, ఏ ఒక్క కులానికీ చెందినవి కావు. ఉత్తరాన కూడా ఇలాంటి ప్రజాప్రతినిధులున్నారు, దక్షిణాదిన..  పశ్చిమాన కూడా, తూర్పున కూడా ఇది పరిస్థితి.   ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వీరిలో ఉన్నారు.   గతంలో ముఖ్యమంత్రుల పదవి చేపట్టిన వారిలో కూడా   విద్య లేని వారున్నారు. ఇక్కడ ఎవరి పేరూ ఎత్తి చూపాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే చదువు తక్కువ ఉండటం నేరం కాదు, అది ప్రజాసేవకు అడ్డూ కాదు. గ్రామీణ భారతాన్ని అర్థం చేసుకోవడానికి తరగతి గది పట్టా అవసరం లేదు. అనుభవం కూడా విద్యే.   అసలు సమస్య అక్కడ కాదు.. అఫిడవిట్లో ఒకటి చెప్పి, వేదికపై మరొకటి చెప్పడం. చదవని పుస్తకాల లెక్కలు, కొలవలేని గ్రంథ జ్ఞానం,  నేను పండితుడిని  అన్న భంగిమ..  ఇవి ఏ రాష్ట్రంలోనైనా, ఏ పార్టీలోనైనా ఒకేలా కనిపిస్తాయి. అది ఒక వ్యక్తి అబద్ధం మాత్రమే కాదు.. దాన్ని నిజమని నమ్మి, ప్రశ్నించిన వారిని దూషించే ఒక అనుచరగణం తయారవడం ప్రమాదం. ఆ అనుచరగణాన్ని తయారు చేసేవారిలో ఎక్కువ మంది డిగ్రీలు ఉన్నవారే , ఉన్నత విద్యావంతులై అయి ఉండటం ఒక విషాదం. అదే..  గోబెల్స్ పాత్ర మళ్లీ జీవం పోసుకోవడం.

 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎంతో చదువుకున్న వారు,  సాధారణంగా తార్కికంగా ఆలోచించే వ్యక్తులు కూడా రాజకీయ నాయకుల పట్ల భావోద్వేగంగా బంధితులవుతారు. వారిని మత శ్రద్ధతో సమర్థిస్తారు, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుతారు, ప్రశ్నించిన వారిపై దాడి చేస్తారు. చదువు డిగ్రీలను ఇస్తుంది.. వివేకాన్ని, స్వతంత్ర ఆలోచనను, ప్రచారం నుంచి విముక్తిని హామీ ఇవ్వదు. ఇది ప్రమాదకరం ఎందుకంటే, ఒకసారి ఒక వ్యక్తి తన రాజకీయ గుర్తింపును  స్వీయ గౌరవంగా మార్చుకున్నాడంటే, ఆ గుర్తింపుపై వచ్చిన విమర్శను తనపై వచ్చిన దాడిగా భావిస్తాడు. అప్పుడు వాదన ముగుస్తుంది, భక్తి మొదలవుతుంది. ఇక్కడ కులం ప్రశ్నను కూడా నిజాయితీగా చెప్పాలి. కులం ఈ దేశంలో ఒక సామాజిక వాస్తవం. అణచివేతకు గురైన సమూహాలు రాజకీయంగా సంఘటితం కావడం సహజం. అది అవసరం కూడా. కానీ కులం ఏకైక అర్హతగా మారినప్పుడు, సమర్థత రెండో స్థానానికి జరిగిపోయి, ప్రజాసేవ అనేది ఒక సమూహానికి ప్రాతినిధ్యం ఇవ్వడంగా మారిపోతుంది. కులం గుర్తింపుగా మిగిలితే ప్రజాస్వామ్యం బలపడుతుంది.  కులమే అర్హత అయితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ఇది ఏ ఒక్కరి మీద మాత్రమే చెప్పే మాట కాదు.  తెలుగు రాష్ట్రాల రాజకీయ వ్యవస్థ మొత్తం మీద చెప్పే మాట. మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే, ప్రజలు తమ స్నేహాలను నాశనం చేయడానికి, కుటుంబాలను చీల్చడానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధపడతారు.  తమ ఉనికిని కూడా గుర్తించని నాయకుల కోసం. ఎన్నికల్లో ఎవరు గెలిచినా నాయకుడు అధికారంలోనే ఉంటాడు.  ఓడిపోయేది, నష్టపోయేది సామాన్యుడే. 

ఇప్పుడు మీడియా మరీ ముఖ్యంగా  ఎలక్ట్రానిక్ మీడియా  టీఆర్పీ (TRP) వ్యాపారంగా మారింది.  సోషల్ మీడియాలో పెద్ద భాగం నియంత్రిత ప్రచార యంత్రంగా మారింది. చర్చలు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన చోట.. ఎవరు గెలిచారు  అన్నదే తప్ప విధానం ఏమిటి అన్న విషయం అప్రధానంగా మారిపోతుంది.  ఫలితంగా ప్రజలు సమాచారాన్ని పొందుతున్నారు, జ్ఞానాన్ని పొందడం లేదు. గోబెల్స్ కాలంలో ప్రచారానికి ఒకే ఒక్క గొంతు ఉండేది..  ఈ రోజు వేల గొంతులు ఉన్నా, అవి ఒకే మాటను పునరావృతం చేస్తున్నాయి. నిజాయితీగా ప్రశ్నించే పాత్రికేయుడు “పక్షపాతి”గా ముద్ర వేయబడతాడు; ప్రశ్నించని పాత్రికేయుడు “దేశభక్తుడు” అవుతాడు. నాయకులకు పాలు పోసే పూజలు, కటౌట్లకు అభిషేకాలు, సినిమా హీరోను దైవంగా చిత్రించే ప్రచార చిత్రాలు   ఇవన్నీ గోబెల్స్ రూపొందించిన శైలికి కొత్త రూపాలు మాత్రమే. ఇది మీడియా స్వేచ్ఛ కాదు; మీడియా స్వేచ్ఛను వాడుకుని చేసే మోసం.

మొదటిది, సంస్థల బలహీనత. ప్రజలు నాయకుడిని నమ్మి సంస్థను నమ్మకపోతే, ప్రజాస్వామ్యం వ్యక్తుల మీద ఆధారపడిపోతుంది. పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల యంత్రాంగం ఇవి బలహీనపడితే, ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు రక్షణ లేకుండా మిగిలిపోతారు. రెండోది, ఆర్థిక ప్రభావం. ఆధారిత రాజకీయం (dependency politics) ఎక్కువమంది నాయకులకు ఆకర్షణీయం, ఎందుకంటే ఉచితాలపై ఆధారపడిన పౌరులను సమీకరించడం సులభం; నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధితో సశక్తులైన పౌరులను సమీకరించడం కష్టం. ఉచితాలు తాత్కాలిక ఉపశమనం ఇవ్వవచ్చు; కొన్ని సందర్భాల్లో అవసరం కూడా కావచ్చు. కానీ అవి దీర్ఘకాలిక సశక్తీకరణకు ప్రత్యామ్నాయం కాకూడదు. ఏ దేశమూ పంపిణీ చేసుకుంటూ సంపన్నం కాలేదు. మూడోది, సామాజిక ప్రభావం. ద్వేషం రాజకీయ సాధనంగా మారిన సమాజంలో సామాజిక విశ్వాసం  క్షీణిస్తుంది. విశ్వాసం క్షీణించిన సమాజంలో వ్యాపారం, పెట్టుబడి, ఆవిష్కరణ, సహకారం అన్నీ నెమ్మదిస్తాయి. ఆర్థిక వృద్ధి  దెబ్బతింటుంది. నాలుగోది, నైతిక ప్రభావం. ఒక తరం పిల్లలు ప్రశ్నించడం అనేది దేశ ద్రోహం అని నేర్చుకుంటే, మరుసటి తరం ప్రశ్నించడం అనవసరం  అని నేర్చుకుంటుంది. అదే నిజమైన ప్రమాదం. 

ఈ చరిత్రలో మనం గమనించాల్సిన విషయం ఒక్కటే. ఒక నాయకుడికి చదువు లేకపోవచ్చు.  కానీ అతడి వెనుక ఉన్నత విద్యావంతులు ఉండవచ్చు. నాయకుడు చేసే ప్రతి పనినీ సమర్థిస్తూ, అతడి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే వ్యక్తులు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఆ విద్యకు అర్థం ఏముంటుంది? సార్థకత ఏముంటుంది? చదువు కంటే ప్రశ్నించే తత్వం ముఖ్యం. డిగ్రీల కంటే స్వతంత్రంగా ఆలోచించే గుణం ముఖ్యం. నాయకుడి పట్ల విధేయత కంటే నిజం పట్ల విధేయత ముఖ్యం. నేటికీ చదువు లేని ప్రతి హిట్లర్ వెనుక ఒక డాక్టరేట్ పొందిన గోబెల్స్ ఉండవచ్చు. కాలం మారినా, గుడ్డి భక్తుల పాత్ర మాత్రం మారడం లేదు.

ఈ దేశం నిండా..  ఉత్తరం నుంచి దక్షిణం వరకూ..  రాజకీయ నాయకుల్ని, సినిమా నటుల్ని, క్రీడాకారుల్ని, కుల దైవాలుగా భావించే ధోరణి పెరిగిపోతోంది. ఆ భక్తి మనల్ని ఏ దారికీ తీసుకెళ్లదు. నాయకుడిని గౌరవించవచ్చు,  పూజించకూడదు. పార్టీని ప్రేమించవచ్చు, ప్రశ్నించడం మానకూడదు. ప్రజాస్వామ్యం నిలబడేది నాయకుల వల్ల కాదు.. తమ తీర్పును, తమ మనస్సాక్షిని, తమ ఆలోచనా స్వేచ్ఛను ఎప్పుడూ అప్పగించని అప్రమత్త పౌరుల వల్లనే. ఆ పౌరుడు మేల్కొన్న రోజే ఈ గోబెల్స్ యుగం ముగుస్తుంది.

మీకు నచ్చవచ్చు:   చంద్రబాబుపై జగన్ అస్త్రం మావిగన్ !.. ఏదైనా జగన్ మూడుముక్కలాట వదలడం లేదుగా?

తుగ్లక్, హిట్లర్, గోబెల్స్‌కు ప్రతిరూపం జగన్ ?


-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   


[Hitler, Goebbels Propaganda Machine,  Politics,  Educational Qualifications, TeluguOne]