TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుట్టిన రోజున కేక్ తెస్తుండగా..హిట్ అండ్ రన్‌లో దుర్మరణం..!

Published on: Thu Sep 17, 2026 7:39PM

గంటకు 100 కి.మీ వేగంతో వచ్చి.. బర్త్ డే నాడే ప్రాణం తీసిన కారు..!

దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరుగుతున్న వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు దాటుతున్న నిర్దోషుల ప్రాణాలను వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు బలిగొంటున్నాయి. తాజాగా  గ్రేటర్ నోయిడాలోని ఏక్ మూర్తి చౌక్ వద్ద జరిగిన హృదయ విదారక ఘటన కలకలం రేపింది. హిమాంశు రాయ్ అనే 32 ఏళ్ల వ్యక్తి తన పుట్టినరోజును భార్య పిల్లలతో కలిసి జరుపుకోవడానికి కేక్ కొనుక్కుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి కారణంగా తెల్లవారుజామున బర్త్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్న అతడి ఆశలను ఆ అతివేగపు కారు చిద్రం చేసింది. గంటకు ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు హిమాంశు రాయ్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. కారు ఢీకొట్టిన ధాటికి బాధితుడు గాలిలోకి ఎగిరిపడ్డాడు. కారు రియర్-వ్యూ కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హిమాంశు శరీరంలో ఏకంగా 32 చోట్ల బోన్ ఫ్యాక్చర్లు అయినట్లు వైద్యులు వెల్లడించారు. స్థానికుల సహకారంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిస్రాఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, ప్రమాకారిక కారును నడిపిన 24 ఏళ్ల ప్రియాన్షు అనే విద్యార్థి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. పుట్టినరోజు నాడే జరిగిన ఈ అనూహ్య ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

ఈ ఘటన మరవకముందే గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై బైకర్‌పై కారుతో దాడి చేసిన మరో దారుణం వెలుగు చూసింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న శివానీ చౌహాన్ అనే యువతి బైకును ఉద్దేశపూర్వకంగా కారుతో వెంబడించి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె కిందపడిపోగా, రాజస్థాన్‌లోని దౌసాలో నిందితులు కళ్యాణ్ బైన్స్ నాగ్ (33), అతనితో పాటు ఉన్న లవ్నీష్ (32)ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు, గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో గురుగ్రామ్‌లోని న్యూ పాలం విహార్ శ్రీ రామ్ చౌక్ సమీపంలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై గ్రిల్స్ అమర్చుతుండగా ఢిల్లీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు దూసుకొచ్చి ఇద్దరి ప్రాణాలను స్పాట్‌లోనే బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రోజురోజుకు పెరుగుతున్న ఈ ప్రాణాంతక హిట్ అండ్ రన్ సంస్కృతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, విపరీతమైన అతివేగం, నిబంధనలను గాలికొదలడం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క క్షణం చేసే నిర్లక్ష్యం కుటుంబాలను జీవితాంతం కోలుకోలేని విషాదంలో ముంచేస్తోంది. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయడానికి కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని, సీసీటీవీ నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని, వేగ పరిమితులు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై పోలీసులు మరింత ఉక్కుపాదం మోపితేనే ఇలాంటి మరణాలకు చెక్ పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

 

 

[ hit and run delhi, greater noida accident, 100 kmph crash, delhi ncr road safety, dwaraka expressway accident, rash driving case ]