TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రగత్తె వేట: మధ్యయుగంలో దారుణం..అనాగరిక శిక్షలు, అమనుష హత్యలు.!

Published on: Mon Sep 28, 2026 6:00PM

మధ్యయుగం నుంచి ఆధునిక యుగారంభం వరకు ఐరోపా దేశాలలో  మంత్రగత్తె అనే నిరాధారమైన ముద్ర వేసి వేలాది మంది మహిళలను దారుణంగా హింసించి పొట్టనబెట్టుకున్న  రక్తచరిత్ర వెలుగులోకి వచ్చింది. దేవుని పేరిట, చట్టబద్ధమైన ఆదేశాల ముసుగులో మహిళలపై సాగిన ఈ సామూహిక హత్యలు మానవ నాగరికత ముఖంపై చెరగని మచ్చగా నిలిచిపోయాయి. కేవలం అనుమానాలు, మూఢనమ్మకాల ఆధారంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధిక శాతం నిస్సహాయ మహిళలే కావడం గమనార్హం.   

ఈ హింసాకాండకు ప్రధాన అస్త్రంగా నిలిచింది పదిహేనవ శతాబ్దం చివరి నాటికి రూపుదిద్దుకున్న 'మల్లెయస్ మాలెఫికారమ్  అనబడే ఒక వివాదాస్పద గ్రంథం.  మంత్రగత్తెల సుత్తిగా పిలువబడే ఈ పుస్తకం మంత్రవిద్యను ఒక తీవ్రమైన మతద్రోహ నేరంగా వర్గీకరించింది. దీనిని రచించిన హెన్‌రిచ్ క్రేమర్, జాకబ్ స్ప్రెంగర్ అనే సన్యాసులు మంత్రవిద్యకు ఎలాంటి చికిత్స లేదని,  మరణశిక్ష ఒక్కటే మార్గమనీ, దానిని  అమలు చేయాలని గట్టిగా సిఫారసు చేశారు. పోప్ ఇన్నసెంట్ ఎనిమిదవ ఇష్యూ చేసిన ప్రత్యేక శాసనం ఆధారంగా తయారైన ఈ గ్రంథం..  కేథలిక్ మరియు ప్రొటెస్టెంట్ ప్రాంతాలలో అధికారిక న్యాయ మార్గదర్శకంగా మారిపోయింది.   

చట్టబద్ధమైన విచారణల పేరుతో నిందితులను చిత్రవధ చేసే పద్ధతులు  అమానుషంగా ఉండేవి. మహిళలను నగ్నంగా మార్చి, వారి శరీరంపై ప్రతి వెంట్రుకను తొలగించి, దెయ్యపు ముద్రల కోసం సూదులతో గుచ్చి భయానక పరీక్షలు నిర్వహించేవారు. నిద్రపోకుండా చేయడం, వేడి ఇనుప వస్తువులతో ముద్రలు వేయడం వంటి  హింసా పద్ధతులను  ప్రయోగించి బలవంతంగా తప్పు ఒప్పుకునేలా చేసేవారు. ఇలాంటి అక్రమ పద్ధతుల ద్వారా నెగ్గిన విచారణల ఫలితంగా వందలాది గ్రామాల్లో మారణహోమం సాగింది.   

ఈ వేటలో పవిత్ర రోమన్ సామ్రాజ్య పరిధిలోని జర్మన్ ప్రాంతాలు   కేంద్రాలుగా మారాయి. ట్రయర్, ఫుల్డా, వుర్జ్‌బర్గ్ ప్రాంతాలలో సాగిన సామూహిక విచారణల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు.  మంత్రగత్తె సంతానం అనే నెపంతో చిన్న పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్న దారుణాలు నాటి అధికారిక రికార్డుల్లో నమోదై ఉన్నాయి. చిన్నస్థానిక న్యాయస్థానాలకు ఎలాంటి పైఅప్పీలు లేకుండా ఉరితీసేఅధికారాలు ఉండటంతో ఈ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 

మొదటి దశలో అంటే 15వ శతాబ్దం వరకు మంత్రగత్తె విచారణలు అరుదు.. శిక్షలూ చిన్నవే. బహిరంగ పశ్చాత్తాపం, కాళ్లకు బంధనం వంటివి మాత్రమే శిక్షలు. 1468లో పోప్ మంత్రవిద్యను (crimen exceptum) అసాధారణ నేరంగా ప్రకటించడంతో విషయం మలుపు తిరిగింది.  సాక్ష్యాధారాలు దొరకని కేసుల్లో కూడా హింసను వాడేందుకు చట్టపరమైన  పరిమితులూ ఎత్తివేయబడ్డాయి. 1484–86లో పోప్ శాసనం, సుత్తి గ్రంథం వెలువడ్డాయి. తర్వాత 1560 నుంచి 1630 వరకు — కౌంటర్-రిఫర్మేషన్, మత యుద్ధాల నేపథ్యంలో..  వేట ఉచ్ఛస్థితికి చేరుకుంది.  ఈ ఏడు దశాబ్దాల్లోనే 40 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

జర్మన్ మాట్లాడే పవిత్ర రోమన్ సామ్రాజ్య ప్రాంతాల్లో ఈ వేట అత్యంత భీకర రూపం దాల్చింది. ట్రయర్ (1581–93), ఫుల్డా (1603–06), ఐక్స్టాట్ (1613–30), వుర్జ్బర్గ్ (1626–31), బాంబర్గ్ (1626–31) సామూహిక విచారణల్లో వందల సంఖ్యలో ఉరితీతలు జరిగాయి. వుర్జ్బర్గ్లో మాత్రం దాదాపు 900 మంది అమరుడయ్యారు — రాజకుటుంబీకుల నుంచి ఏడేళ్ల పసిపిల్లల వరకు ఎవరూ తప్పించుకోలేదు. హింసతో గెలిపించిన  ఒప్పుకోలుల  ద్వారా ఇతర పేర్లు చెప్పించడం, అలా పేర్లు చెప్పినవారిని మళ్లీ హింసించడం..  ఇలా ఆరోపణల చైన్ రియాక్షన్లా గ్రామాలు, పట్టణాలు మొత్తం ముంచెత్తింది.

స్కాట్లాండ్లో 1590లో నార్త్ బెర్విక్ విచారణలు జరిగాయి..  రాజు జేమ్స్ VI స్వయంగా విచారణల్లో పాల్గొని, హింసను సిఫారసు చేసి, 1597లో  Daemonologie' అనే గ్రంథమే రాశాడు. ఇంగ్లాండ్లో 1612లో పెండుల్ విచారణల్లో 11 మందిలో 10 మంది ఉరితీయబడ్డారు. ఈ మహమ్మరి 1692లో ఉత్తర అమెరికాలోని సేలమ్ వరకు వ్యాపించింది. 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి యూరప్ అంతటా వేట నిలిచిపోయింది; స్కాట్లాండ్లో 1736లో విచ్క్రాఫ్ట్ చట్టం రద్దయింది. 

 చరిత్రకారుల అంచనాల ప్రకారం క్రీ.శ. 1400 నుంచి 1780 మధ్య కాలంలో దాదాపు లక్ష మందిని విచారించి..   40 వేల నుంచి 60 వేల మంది వరకు చిత్రహింలకు గురి చేసి శిక్ష విధించి చంపేశారు. అలా మరణశిక్షకు గురైన వారిలో  80 శాతం మంది మహిళలే కావడం, అందులోనూ నాల్గో వంతు మంది నలభై ఏళ్లు దాటిన పేద, వితంతు మహిళలే కావడం గమనార్హం. మతం, రాజకీయ అధికారాలు, న్యాయ వ్యవస్థ అన్నీ కలిసి సాగించిన ఈ వ్యవస్థీకృత అమానుషంలో..  సమాజంలోని దుర్బలులే  లక్ష్యంగా మారారు.   ఈ దుర్ఘటనల తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆధునిక సమాజం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్కాట్లాండ్ వంటి దేశాలు నాటి కాలంలో అన్యాయంగా బలైన బాధితులకు పార్లమెంట్ వేదికగా అధికారిక క్షమాపణలు తెలియజేశాయి. 

అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా మంత్రగత్తె ఆరోపణల పేరుతో జరిగే దాడులను ఖండిస్తూ ప్రత్యేక తీర్మానాలు ప్రవేశపెట్టింది.   అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల ఆధారంగా బలహీనులపై అకృత్యాలు ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదు. కాలం మారుతున్న కొద్దీ ఆరోపణలు చేసే పద్ధతులు మారుతున్నప్పటికీ, బలిపశువులుగా మారే వారు మాత్రం ఎప్పుడూ సమాజంలో అత్యంత దుర్బలులైన వర్గాలవారే ఉంటున్నారు. ఈ చారిత్రక తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తరంపై ఉంది. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   


[History Witch-Hunting, Witchcraft  Europe, Malleus Maleficarum, Medieval Persecution, Historical Analysis, Telugu One]