ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ నియామకం.!
Published on: Fri Sep 4, 2026 10:03AM

ఆంధ్రప్రదేశ్ లోవిద్యా హక్కు చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన పాతిక శాతం ఉచిత సీట్ల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. అర్హులైన నిరుపేద కుటుంబాల పిల్లలకు ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు వీలుగా 16 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఛైర్మన్‌గా ఈ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీకి సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాల ప్రముఖులు, అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించింది.

గతంలోని విధివిధానాలను సమీక్షించి, దేశ సర్వోన్నత న్యాయస్థానం జనవరిలో వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నూతన నిబంధనలను రూపొందించనున్నారు. అలాగే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరిగేలా పకడ్బందీ విధానాన్ని రూపొందించడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత.
ఈ కమిటీ త్వరలోనే సమావేశమై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.
ఇదిలా ఉండగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యా రంగంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 173 మందిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఇందులో పాఠశాల విద్యా విభాగం నుంచి 79 మంది, ఇంటర్మీడియట్ విద్య నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14 మంది, ఉన్నత విద్యా విభాగం నుంచి 56 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు స్వీకరిస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పతకం, శాలువాతో పాటు 20 వేల రూపాయల నగదు బహుమతితో సత్కరిస్తారు. విద్యారంగంలో సంస్కరణలతో పాటు ఉపాధ్యాయులను ప్రోత్సహించడం ద్వారా విద్యా ప్రమాదాలను మరింత మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
[High level Committe on Free Admitions, AP Government, Private School Free Admissions, Right to Education Act, Tameem Ansaria, Chandrababu Naidu]


