అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లిలోని ఓపెన్ కాస్టుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. కెటిపిసికి బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఎర్పడింది. అలాగే రాజమండ్రి నగరం, రూరల్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆచంట మండలంలోని ఆరు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో వేసిన వరినాట్లు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే వరినాట్లు ఆలస్యం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.