ఏపీకి భారీ వర్ష సూచన.!
Published on: Mon Sep 21, 2026 6:10PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా, ఈ తరువాత తీవ్ర వాయుగుండం గా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం (సెప్టెంబర్ 21) వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం-మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
[Heavy Rain Alert Andhra Pradesh, Costal, Andhra, Telugu News, Telugu One]


