టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గాలంటే ఇలా చేయండి..!
Published on: Sun Oct 4, 2026 5:13PM
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
మనం చేసే చిన్న చిన్న పనులు, ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే..
LI4 పాయింట్..
మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
యాంగ్ టాంగ్ పాయింట్..
నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్ ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది.
నీరు..
శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాంప్రెస్..
తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి.
ఆయిల్స్..
పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి.
అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది.
ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.



