TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..!

Published on: Fri Oct 30, 2026 9:00AM

 ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..!

ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. సమాజంలో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. అదే సమయంలో కొడుకు చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం ఆ ఇల్లు  సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఒక కుటుంబం ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోవడానికి ఇంట్లోని పిల్లల ప్రవర్తనే మూలం అవుతుంది.  మరీ ముఖ్యంగా.. కొడుకు ఎలా ఉండాలి? కొడుకు ఎలా ఉంటే ఆ కుటుంబం అంతా నిశ్చింతగా, అందరిలో గౌరవంగా ఉంటుందో వివరంగా తెలుసుకుంటే..

ఓ చక్కని ఉదాహరణ..

మన జీవితంలో కొన్ని విషయాలను చిన్న ఉదాహరణలతో అర్థం చేసుకోవడం చాలా సులభం. అడవిలో ఒకే ఒక చెట్టు ఎండిపోయి దానికి నిప్పు అంటుకుంటే, ఆ ఒక్క చెట్టు కారణంగా చుట్టుపక్కల ఉన్న పెద్ద అడవి మొత్తం కాలిపోతుంది. సరిగ్గా అలాగే, ఇంట్లో ఒకరు చెడు మార్గంలో నడిచినా లేదా చెడు అలవాట్లకు అలవాటు పడినా, అది ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. ఆ కుటుంబం మొత్తం  పరువును, సమాజంలో వారికున్న గౌరవాన్ని మట్టిలో కలిపేస్తుంది. అందుకే పిల్లల చిన్ననాటి నుంచి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. చెడు స్నేహాలు, తప్పుదారి పట్టే అలవాట్లకు పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రులది, కుటుంబానిదే బాధ్యత.

కుటుంబానికి అండగా నిలిచే కొడుకు ఉంటే..

చీకటి రాత్రిలో చంద్రుడు తన వెలుతురుతో నలుదిక్కులా ప్రకాశాన్ని నింపినట్లుగా, ఒక మంచి సంస్కారమున్న కొడుకు తన కుటుంబం మొత్తానికి వెలుగునిస్తాడు. సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చిపెడతాడు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండటం ముఖ్యం కాదు, ఉన్న ఒక్కరు చాలు కుటుంబానికి గర్వకారణంగా నిలవడానికి.

మంచి కొడుకులో ఉండాల్సిన  లక్షణాలు..

తన జీవితానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునే పరిపక్వత ఉండాలి. చదువు, కెరీర్ పరంగానూ సొంతంగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. కాలానికి తగినట్టుగా   తనను తాను మార్చుకుంటూ, అడుగడుగునా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం చాలా అవసరం.

కేవలం తన గురించి మాత్రమే కాకుండా, ఇంట్లోని పెద్దలను గౌరవించడం, వారి మనసులోని భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ జీవితాన్ని పిల్లల కోసం ధారపోస్తారు కాబట్టి, వారి వృద్ధ్యాప్యంలో వారికి అండగా ఉంటూ, వారి ప్రతి మాటకు విలువనివ్వాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాలను కూడా అందరితో కలిసి పంచుకుంటూ, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాలి.

కుటుంబానికి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా అందరికీ అండగా నిలబడాలి. ఆర్థికంగా లేదా మానసికంగా ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని కుటుంబానికి భరోసా కల్పించాలి. అప్పట్లో తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తిస్తూ, వారికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఒక బాధ్యతాయుతమైన కొడుకు లక్షణం.

ఎప్పుడూ నిజాయితీని, క్రమశిక్షణను పాటించడం ద్వారా చుట్టూ ఉన్నవారికి కూడా మంచి ప్రేరణగా నిలవాలి. సమాజంలో నలుగురితో కలిసిమెలిసి ఉండే తీరు, ఇతరులకు సహాయం చేసే గుణం ఆ కొడుకును మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి. మంచి పనులతో, కష్టపడే తత్వంతో తన భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలబడే కొడుకు ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఎటువంటి టెన్షన్ లేకుండా నిశ్చింతగా జీవించవచ్చు.

                                                                                                                                               *రూపశ్రీ.