అసెంబ్లీ వద్ద హరీష్‌రావు అరెస్ట్.!
Published on: Mon Sep 7, 2026 11:01AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.హరీష్‌రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన అరెస్టుకు నిరసనగా హరీష్ రావు తాను వేసుకువచ్చిన నల్ల టీషర్లు విప్పేసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై ఆందోళనలు చేపట్టాలని ఆదివారం (సెప్టెంబర్ 6) ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. హరీష్ అరెస్టుతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంతకు ముందు..గన్ పార్క్ వద్ద అమరవీరుల స్ఫూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సబ్డండ వర్ణాలనూ మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామంటూ 420 హామీలను గుప్పించిన కాంగ్రెస్.. వెయ్యి రొజులు దాటినా వాటి గురించి మాట్లాడటం లేదని కేటీఆర్ విమర్శించారు.
ఇలా ఉండగా హరీష్ రావు అరెస్టుపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేక అక్రమ అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామికమని విమర్శించారు. మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం అన్నారు.
అసెంబ్లీ వద్ద పెద్ద సంఖ్యలోపోలీసులను మోహరించి, సభకు వస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకే బీఆర్ఎస్ సభ్యులు నల్ల టీ షర్టులతో సభకు వచ్చారన్నారు. సభలోకి వెళ్లడానికి ముందే అరెస్టులు చేయడం దుర్మార్గమన్న తలసాని శ్రీనివాసయాదవ్.. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బ్లాక్ టీషర్ట్ లో లోక్ సభకు వెళ్లవచ్చు కానీ, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రాకూడదా అని నిలదీశారు.
[Harish Rao Arrest, Telangana Assembly, Talasani Angry, Telangana Politics, Telugu One]


