TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రేమించలేదని హత్య: నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసులో నిందితుడు అరెస్ట్.!

Published on: Thu Oct 1, 2026 5:03PM

బైక్ క్లచ్ వైరుతో గొంతు బిగించి కిరాతకంగా హతమార్చాడు.!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తీవ్రంగా శ్రమించి చివరకు మిస్టరీని ఛేదించారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ పవన్ కుమార్‌ను ఏపీలోని తిరుపతిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంగన్నపాలెంకు చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు పవన్ కుమార్‌ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే పవన్ ఎలాంటి పనిపాట లేకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో హరిణి అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సుమారు ఏడాది క్రితం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెద్ద మనుషుల పంచాయతీ కూడా నిర్వహించారు. 

పవన్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేది లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చిచెప్పినప్పటికీ పవన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఆమె వెంటపడుతూ తరచూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులతో తీవ్రంగా విసిగిపోయిన హరిణి, అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సైతం మార్చేసింది. తనను పూర్తిగా దూరం పెడుతోందన్న తీవ్రమైన కక్ష, అక్కసుతోనే పవన్ కుమార్ ఈ రాక్షసానందానికి ఒడిగట్టాడు.   పథకం ప్రకారమే సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో హరిణి ఇంటికి వెళ్లిన పవన్, ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని వాగ్వాదానికి దిగాడు. తనను ఎందుకు కాదంటున్నావంటూ ఆమెను నిలదీశాడు. హరిణి ఎంతకీ అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి గురైన నిందితుడు పవన్.. తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైరుతో హరిణి మెడకు గట్టిగా బిగించి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న మెట్ల సందులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. 

సాయంత్రం వేళ తల్లి రాజేశ్వరి ఇంటికి వచ్చి చూసేసరికి హరిణి ఒళ్లంతా గాయాలతో, ముక్కు నుంచి రక్తంతో విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా నిఘా పెట్టగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా మరో వ్యక్తి సెల్‌ఫోన్ హాట్‌స్పాట్‌ను వినియోగిస్తూ పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా గుర్తించారు.   ఆ లొకేషన్‌ను కచ్చితంగా ట్రేస్ చేసిన పోలీసులు పవన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం తిరుపతికి వెళ్లి అక్కడ హాట్‌‌స్పాట్ ఇచ్చిన ఓ సుతారి మేస్త్రీని అదుపులోకి తీసుకుని విచారించారు. గత ఐదారు రోజులుగా పవన్ తన వద్దే పని చేస్తున్నట్లు ఆ మేస్త్రీ చెప్పిన సమాచారంతో పోలీసులు సరిగ్గా ఆ ప్రాంతానికి వెళ్లి మంగళవారం సాయంత్రం పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూలూరుపాడు సర్కిల్ పరిధిలోని పోలీస్‌‌స్టేషన్‌కు తరలించి, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గతంలో జరిగిన రాస్తారోకోలు, ఉద్రిక్తతల అనంతరం పోలీసులు చూపిన ప్రతిభను స్థానికులు అభినందిస్తున్నారు. 

 

 

 

[ Harini murder case, Julurupadu police, Bhadradri Kothagudem, nursing student Harini, Pawan Kumar arrested, Vengannapalem crime news,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]