10 సెకన్లు.. 9 సార్లు నరికివేత: చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పగ తీర్చుకున్న అన్న!
Published on: Mon Sep 21, 2026 10:03AM

తెలంగాణలోని నిజామాబాద్ నగరం సెప్టెంబర్ 17న ఒక దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద పగటిపూట అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు అనే యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటనలో నిందితుడు సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ హత్య వెనుక తీవ్రమైన పగ, ప్రతీకార కోణం దాగి ఉంది. తన చెల్లెలి దారుణ హత్యకు పగ తీర్చుకోవడానికే సంతోష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో స్పష్టమైంది.
అసలు ఈ ప్రతీకార హత్యకు మూలాలు ఆరు నెలల క్రితం జరిగిన ఒక విషాద ఘటనలో ఉన్నాయి. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు పొందిన 19 ఏళ్ల వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా మార్చి 17న, దాదాపు 4 నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవిని భర్త హరిబాబు అత్యంత దారుణంగా గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసులో రెండ్రోజుల తర్వాత అరెస్టయిన హరిబాబు ఐదు నెలల జైలు జీవితం తర్వాత ఆగస్టు 15న బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై విడుదలయ్యాక ప్రాణభయంతో అనంతపురంలోని ఒక గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో పనిచేస్తూ తలదాచుకున్నాడు.
.webp)
ఈ క్రమంలో బెయిల్‌పై బయటకొచ్చిన హరిబాబు తల్లి లక్ష్మి నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్ కాలనీలో అద్దెకుంటూ రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మొక్కజొన్నలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. నిజామాబాద్‌లోనే ఉంటున్న తన తల్లిని చూడటానికి హరిబాబు రహస్యంగా వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైష్ణవి సోదరుడు సంతోష్ పక్కా ప్రణాళికతో పగ తీర్చుకోవడానికి వేచి చూశాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం వేళ ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద హరిబాబు ఒక పానీపూరి బండి వద్ద నీళ్లు తాగుతుండగా, సంతోష్ కారులో వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే తల, మెడ, నడుము భాగాల్లో ఏకంగా 9 సార్లు కత్తితో దారుణంగా నరకడంతో హరిబాబు తీవ్ర రక్తస్రావమై తన తల్లి కళ్లముందే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే కొడుకును నరికి చంపడంతో తల్లి లక్ష్మి తీవ్ర షాక్‌లోకి వెళ్లిపోయింది. ఈ భయానక హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో తీవ్రంగా వైరలయ్యాయి. మార్చి 17న భర్త చేతిలో వైష్ణవి దారుణ హత్యకు గురైతే, సరిగ్గా ఆరు నెలల తర్వాత అదే సెప్టెంబర్ 17న వైష్ణవి సోదరుడి చేతిలోనే హరిబాబు దారుణ హత్యకు గురికావడం గమనార్హం.
హత్య నంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయేందుకు యత్నించిన సంతోష్‌ను నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు మరియు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు సంతోష్‌తో పాటు అతడి తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ నేరాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసులో మిగతా నలుగురి పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[ Nizamabad, Haribabu Murder Case, Santosh, Vaishnavi, Nizamabad Police, Revenge Murder, Korutla, Telangana Crime, RR Chowrasta, CCTV Footage ]


