TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరిబాబు హత్య కేసులో వైష్ణవి అన్న అరెస్ట్..!

Published on: Sun Sep 20, 2026 11:44AM

మర్డర్ కేసులో వైష్ణవి సోదరుడితో పాటు మరో ముగ్గురి పాత్ర..!

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే ఈ దారుణం జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైష్ణవి సోదరుడు గంధం సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించారు. 

ఈ నెల 17వ తేదీన బాధితురాలు చిత్తరి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 169/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్ 103(1) ఆర్/డబ్ల్యూ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. కేసు నమోదైన వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం, సీపీ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా పథకం ప్రకారమే నిందితులు కోరుట్ల నుంచి కారులో వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. 

వైష్ణవి మరణాన్ని మనసులో పెట్టుకున్న ఆమె సోదరుడు గంధం సంతోష్, తన తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్‌లతో కలిసి పగ తీర్చుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కోరుట్ల నుంచి తెల్లవారుజామున లేదా సాయంత్రం ఉపయోగించే తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో నిజామాబాద్‌కు చేరుకున్నారు. నగరంలోని ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలో ఉన్న గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట పానీపూరి బండి వద్ద హరిబాబు నీరు తాగుతున్న సమయంలో, కారు వెనుక కుడివైపు డోర్ నుండి ఒక్కసారిగా కిందకు దిగిన సంతోష్ తన వద్ద ఉన్న కత్తితో హరిబాబు తల, ముఖం అలాగే మెడపై విచక్షణారహితంగా పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కారులో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దారుణం జరిగిన కేవలం ఒకటిన్నర రోజుల్లోనే పోలీసులు ఛేదించడం విశేషం. నిందితుల కోసం గాలించిన నాలుగు ప్రత్యేక బృందాలకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు, నిజామాబాద్ ఔటర్ బైపాస్ ప్రాంతంలో సంతోష్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 19వ తేదీన అతడిని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నేరానికి వాడిన కారును ఒకచోట వదిలేసి, తన అత్తగారి ఊరైన విశాఖపట్నానికి పారిపోయేందుకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన ఒక కత్తితో పాటు, మరో రెండు కత్తులు, రెండు కర్రలు మరియు తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలు సేకరిస్తున్న ఏసీపీ ప్రకాష్, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ను సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

 

 

 

[ Haribabu murder case, Nizamabad crime news, Vaishnavi brother arrested, Gandham Santhosh, Nizamabad police, AP Telangana news,  Commissioner P. Sai Chaitanya,Crime news, CM Revanth reddy, CP Sajjnar, DGP C.V. Anand ]