TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లష్కరే, జైషేలకు అంతర్జాతీయ ఉగ్ర లింకులు: ఇండియా భద్రతకు పెనుముప్పు.?

Published on: Thu Oct 8, 2026 12:43PM

హమాస్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న  ఘర్షణ ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని దాటి దక్షిణాసియా భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా?  అంటే ఇజ్రాయెల్ ఔననే అంటున్నది. భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్  తాజాగా  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భద్రతా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  ఏడాది కాలంలో హమాస్‌కు చెందిన పలువురు కీలక కమాండర్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో పర్యటించారని అజార్ పేర్కొన్నారు.  

హమాస్‌కు చెందిన నాజీ జహీర్, ఖాలెద్ అల్ కదూమి వంటి వ్యక్తులు పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న అజార్.. ఈ పరిణామాలను   యాదృచ్ఛిక ఘటనలుగా  కొట్టి పారేయలేమన్నారు. అయితే హమాస్ కమాండర్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో పర్యటించారన్న అజార్ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ధృవీకరణ లేదు.  

హమాస్ కార్యకలాపాల ప్రభావం దక్షిణాసియాలోని ఉగ్ర సంస్థలపై పడుతోందని ఇజ్రాయెల్ హెచ్చరికతో దక్షిణాసియాలో ఆందోళన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలతో హమాస్ ప్రతినిధుల లింకులు ఇండియాకు ముప్పు అన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఒక ఉగ్ర సంస్థ అనుభవాలు, వ్యూహాలు మరో సంస్థకు చేరితే  భద్రతా పరంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

హమాస్ కమాండర్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో పర్యటించిన విషయాన్ని చెబుతూ.. భారత్ లోని ఇరాన్ రాయబారి 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని  ప్రస్తావించారు. హమాస్ సిద్ధాంతాలు, కార్యకలాపాల ప్రభావం ఈ ప్రాంతంలోని ఉగ్ర సంస్థలపై కనిపిస్తోందనడానికి పహల్గామ్ ఉగ్రదాడి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.  అయితే పహల్గామ్ దాడికి హమాస్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్ధారించే ఆధారంగా ఈ వ్యాఖ్యను పరిగణించకూడదనీ, అది ఇజ్రాయెల్ రాయబారి వ్యక్తం చేసిన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ పరిశీలకులు అంటున్నారు.   

అది పక్కన పెడితే.. ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో పర్యటన నిజమై అయితే.. అది ఇండియాకు నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండూ భారత్‌  సరిహద్దు దేశాలే. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్ర సంస్థలతో అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌లకు సంబంధాలు ఏర్పడుతున్నాయన్న అనుమానాలు నిజమైతే.. అది భారత్ భద్రతకు పెను సవాల్ అనడంలో సందేహం లేదు.    మొత్తంగా చూస్తే.. గాజా యుద్ధం ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా దక్షిణాసియా ఉగ్ర నెట్‌వర్క్‌లపై కూడా పడుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.  

[Hamas Commandors tour Pakistan Bangladesh, Israel India, Reuven Azar, LashkareTaiba, JaisheMohammed, Terror Network, Pahalgam Attack, Telugu One]