వెన్నుముక ,శాశ్వతంగా దెబ్బతినకుండా ఉండాలంటే. వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Published on: Fri Oct 16, 2026 11:07AM
(16).webp)
ప్రపంచ వెన్నుముక దినోత్సవం (World Spine Day) సందర్భంగా, జిమ్లో చేసే వ్యాయామాలు మరియు బరువులు ఎత్తడం వల్ల వెన్నుముకకు శాశ్వత నష్టం కలుగుతుందా లేదా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. కోల్కతాలోని నారాయణ ఆర్ఎన్ టాగోర్ హాస్పిటల్ కన్సల్టెంట్, స్పైన్ సర్జన్ డాక్టర్ సాయి విక్షేత్ రాజ్ బసాని దీనిపై స్పష్టతనిచ్చారు. సరైన పద్ధతిలో చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ వెన్నుముకను పాడుచేయదు సరికదా, దానికి మద్దతుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తుందని మరియు కోర్ స్టెబిలిటీని మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. చాలా మంది జిమ్ వ్యాయామాలు లేదా బరువులు ఎత్తడం వల్లే వెన్నుపూస దెబ్బతింటుందని తప్పుగా భావిస్తుంటారు, కానీ వాస్తవానికి సమస్య వ్యాయామంలో లేదు, దానిని చేసే విధానంలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీర సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం, సరైన భంగిమ (Posture) పాటించకపోవడం మరియు వ్యాయామ తీవ్రతను ఒక్కసారిగా పెంచడం వంటి పొరపాట్లు వెన్నుముక డిస్కులు, కీళ్లు, స్నాయువులు మరియు చుట్టుపక్కల కండరాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. వ్యాయామం చేసిన వెంటనే వెన్నునొప్పి రాగానే అది వెన్నుముకకు జరిగిన శాశ్వత నష్టంగా భావించకూడదని డాక్టర్ బసాని స్పష్టం చేశారు. కొత్తగా లేదా కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు కండరాల నొప్పులు రావడం సహజం, సరైన విశ్రాంతి తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి. అయితే, నొప్పిని లెక్కచేయకుండా అదేపనిగా వ్యాయామాలు కొనసాగించడం, లక్షణాలను విస్మరించడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు కొందరు తమ శారీరక శక్తిని మించి బరువులు ఎత్తుతుంటారు. అలసట కారణంగా కండరాలు బలహీనపడినప్పుడు, రిపీటీషన్లను పూర్తి చేయడానికి భంగిమను తప్పుగా మారుస్తుంటారు. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వకుండా పదేపదే అదే కండరాల సమూహాలపై తీవ్రమైన వ్యాయామాల భారాన్ని మోపడం కూడా ప్రమాదకరమే. కాబట్టి, భారీ బరువుల కంటే సరైన టెక్నిక్కు ప్రాధాన్యత ఇవ్వాలని, బరువులను క్రమంగా పెంచుకోవాలని మరియు ప్రతి సెషన్ మధ్య తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. వెన్నునొప్పి తగ్గకుండా దీర్ఘకాలం కొనసాగడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలహీనత లేదా కాళ్లలోకి నొప్పి పాకడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మూత్ర విసర్జన లేదా మలవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం, గజ్జ ప్రాంతంలో తిమ్మిర్లు వంటి అత్యవసర లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ మెడికల్ అసెస్మెంట్ పొందాలి, ఎందుకంటే ఇవి తీవ్రమైన నరాల కుదింపును (Nerve Compression) సూచిస్తాయి.
చివరగా, భయంతో వెన్నుముక వ్యాయామాలు లేదా వెయిట్ ట్రైనింగ్ను పూర్తిగా మానుకోవడం పరిష్కారం కాదని, తెలివిగా వ్యాయాయం చేయడం నేర్చుకోవాలని డాక్టర్ బసాని సూచించారు. బలవర్ధకమైన శరీరాన్ని నిర్మించడం అనేది ఒక క్రమమైన ప్రక్రియ అని, డంబెల్ లేదా బార్బెల్ మీద కనిపించే నంబర్ కంటే సరైన పద్ధతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రపంచ వెన్నుముక దినోత్సవం మన శరీర ఆకృతిని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. సరైన శిక్షణ, దశలవారీగా బరువు పెంచడం మరియు ముందస్తు హెచ్చరికలను గమనించి తగిన వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఎవరైనా తమ వెన్నుముకను ఆరోగ్యంగా ఉంచుకుంటూ బలమైన శరీరాన్ని పొందవచ్చు.
gym workouts spine damage, back pain gym exercises, gym spine injuries myths, safe heavy lifting tips, gym back safety, gym workouts safe for spine, fitness spine care.


