48 గంటల్లో రాజీనామా చేయండి: సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటమ్.!
Published on: Thu Sep 24, 2026 4:49PM

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. 48 గంటల్లోగా సీఈసీ పదవికి జ్ణానేశ్ కుమార్ రాజీనామా చేసి వైదొలగాలని అల్టిమేటమ్ జారీ చేసింది. లేకుంటే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని తీవ్ర హెచ్చరించింది. ఢిల్లీలో గురువారం (సెప్టెంబర్ 24) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి, నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణ ప్రతిష్టను నిలబెట్టడానికి సీఈసీ పదవి నుంచి తప్పుకోవడం ఒక్కటే మార్గమన్నారు.
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానం కనుమరుగవుతోందన్న ఆయన. ఎవరు ఓటు వేయవచ్చో, ఎవరికి ఆ అర్హత లేదో నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లడం అభ్యంతరకమన్నారు.

ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, దానికి సంబంధించిన విధివిధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అభిజిత్ దిప్కే విమర్శించారు. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీసుకుంటున్న పలు నిర్ణయాలు.. ముఖ్యంగా ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. ఎన్నికల కమిషన్‌లోని అంతర్గత విభేదాలు, ఇతర కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల అంశం తెరపైకి రావడంతో జ్ణానేష్ కుమార్ పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పుడు బొద్దింకల పార్టీ జ్ణానేష్ కుమార్ రాజీనామాకు 48 గంటల గడువు ఇచ్చింది. ఆ లోగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయని పక్షంలో.. తాము గతంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించినట్లుగానే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది.
[Gyanesh Kumar resignation, Cockroach Janata Party, CEC ultimatum, Election Commission controversy, voter list revision protest]


