దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్.!
Published on: Fri Sep 25, 2026 8:58PM

దేశ రాజధానితో పాటు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఓటర్ల జాబితా సవరణ వివాదంపై జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరును, సీఈసీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ఈ నిరసనల్లో భాగంగా అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగొయ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.గౌహతిలో రాజీవ్ భవన్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారీ ప్రదర్శనను ప్రధాన కార్యాలయం వద్దే పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు సీఈవో కార్యాలయం వైపు వెళ్తున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన గౌరవ్ గొగొయ్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి అని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ గొంతును అణచివేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాట్నా, చండీగఢ్ సహా పలు నగరాల్లో ఎన్నికల సంఘం కార్యాలయాలను ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించేందుకు భద్రతా సిబ్బంది వాటర్ క్యానాన్లను ప్రయోగించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలు, అభ్యంతరాల విషయమై ఇటీవల వెలువడిన వార్తల నేపథ్యంలో ఈ ఆందోళనలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై సీఈసీ గ్యానేశ్ కుమార్ తప్పు చేశారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ఆయన రాజీనామాకు పట్టుబడుతోంది.ప్రజాస్వామ్యంలో పౌరుల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని, కానీ ప్రస్తుత యంత్రాంగం దాన్ని కాలరాస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లోనూ దీనిపై తీవ్ర పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.
[ Gyanesh Kumar, CEC Resignation, Vote Deletion, Rahul Gandhi, Election Commission, SIR Controversy, Gaurav Gogoi detained, Congress protests Election Commission, CEC resignation demand, water cannons used in protests ]


