గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌పై కారు బీభత్సం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కార్ ఓనర్..!
Published on: Tue Sep 15, 2026 1:44PM

దూరంగా ఉండండి" అని అడిగినందుకు ప్రాణాలు తీస్తారా? మహిళా బైకర్ ఆవేదన..!
సెలవు రోజు సరదాగా గడపాలనే ఉద్దేశంతో రోడ్డుపై బైక్‌పై ప్రయాణిస్తున్న ఆ యువతికి ఎదురైన అనుభవం ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కేవలం కొంచెం దూరం పాటించండి, భద్రత కావాలని ఆమె అడిగిన ఒక్క మాట ఆ కారు డ్రైవర్‌కు కోపం తెప్పించింది. క్షణాల వ్యవధిలో ఆనందంగా సాగాల్సిన ప్రయాణం కాస్తా ప్రాణాపాయ భయంగా మారింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై చోటుచేసుకున్న ఈ భయానక ఘటన సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించింది.
లేడీ బైకర్ సియా తన స్నేహితులతో కలిసి ఆదివారం రైడింగ్‌కు బయలుదేరారు. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఓ కారు ఆమెను టార్గెట్ చేసినట్లు వెంబడించింది. మొదట దానిని పెద్దగా పట్టించుకోకపోయినా, కొద్దిసేపటికే ఆ కారు హద్దు మీరింది. బైక్‌కు అత్యంత సమీపంగా వస్తూ, దారి ఇవ్వకుండా అడ్డుపడటంతో సియా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదకర పరిస్థితిలో తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఆరాటంతో ఆమె కారు డ్రైవర్ వైపు చూస్తూ తనను కొంచెం దూరంగా ఉంచాలని కోరారు. కానీ ఆ అభ్యర్థనే ఆ డ్రైవర్‌కు మరింత అహంకారాన్ని తెప్పించింది. మరింత రెచ్చిపోయిన డ్రైవర్, బైక్‌ను కారుతో ఢీకొంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఆ క్షణంలో తాను బతికి బయటపడతానని అస్సలు అనుకోలేదని, దేవుడి దయవల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డానంటూ సియా కన్నీటిపర్యమమయ్యారు. ఆమె పంచుకున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు రోడ్లపై మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన గురుగ్రామ్ పోలీసులు వెంటనే స్పందించి సుమోటోగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సెక్టార్ 56 పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసి అసలు నిజాలు వెలికితీసే పనిలో పడ్డారు.ఈ వివాదంలో తాజాగా మరో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న మారుతి సుజుకి సియాజ్ కారు (HR30Y4949) హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. అయితే మీడియా ముందుకు వచ్చిన కారు ఓనర్ మనీష్ అసలు నిజాలు బయటపెట్టాడు. తాను ఆర్మీ ఉద్యోగిని అని, ప్రస్తుతం విధుల్లో భాగంగా అసోంలో ఉన్నానని స్పష్టం చేశాడు.
ఆ సమయంలో కారును తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ నడిపినట్లు తెలిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకొక ఈ విషయం తెలిసిందని, కళ్యాణ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నాడు.రోడ్డుపై వాహనం నడపడమంటే కేవలం వేగంగా వెళ్లడం కాదు... తోటి ప్రయాణికుల ప్రాణాలను గౌరవించడం, భద్రతకు భరోసా ఇవ్వడం. ఒక్క క్షణం కోపం, అహంభావం అమాయకుల ప్రాణాల మీదికి తెస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తోటి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారికి కఠిన శిక్ష పడితేనే రోడ్లపై భద్రత మళ్లీ సాధ్యమవుతుంది.
[ Gurugram women biker incident, woman biker hit by car Gurugram, Golf Course road accident, Cia lady biker video, car owner Manish statement, Haryana Palwal news, road rage against woman biker, latest Telugu news, police investigation on biker incident ]


