TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లంచం కేసులో దొరికిన అధికారిణి.. ఆస్తుల చిట్టా చూసి ఏసీబీకే షాక్.!

Published on: Mon Nov 16, 2026 4:40PM

ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు. కానీ అక్రమ సంపాదన ఆరోపణలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఓవైపు రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన మరువకముందే.. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణికి సంబంధించిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు, భారీ పెట్టుబడుల వివరాలు బయటపడ్డాయి.

ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు నవంబర్ 16న గుండు వాణిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో స్థిరాస్తుల పత్రాలతో పాటు నగదు, బ్యాంకు నిల్వలు, బంగారం, వాహనాలు, వివిధ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.

ప్లాట్లు, భవనాలు.. ఎక్కడికక్కడ ఆస్తులు.!

ఏసీబీ తనిఖీల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ ఓపెన్ ప్లాట్, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల మరో ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు ప్లాట్ల అధికారిక విలువ రూ.87.67 లక్షలుగా ఉంది.

ఇక రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన ఓ నివాస ఫ్లాట్‌తో పాటు, అదే ప్రాంతంలో సుమారు రూ.2.45 కోట్ల విలువైన జీ+2 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. దీని అధికారిక విలువ రూ.29.70 లక్షలుగా పేర్కొంది. అయితే ఈ ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

వైన్స్‌లో పెట్టుబడి.. షేర్లలో రూ.1.30 కోట్లు.!

స్థిరాస్తులకే పరిమితం కాకుండా పెట్టుబడుల రూపంలోనూ భారీ మొత్తాలు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది. మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో రూ.50 లక్షల పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. ఇక షేర్లలో ఏకంగా రూ.1.30 కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడైంది.

బ్యాంకు ఖాతాల్లో రూ.7,97,238 నిల్వలు ఉండగా, ఇంట్లో రూ.5,47,500 నగదు లభించింది. సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించగా, వాటి విలువ రూ.2.54 లక్షలుగా పేర్కొన్నారు. మహీంద్రా XUV700, హ్యుందాయ్ క్రెటా వంటి రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. వీటి మొత్తం విలువను రూ.50 లక్షలుగా అంచనా వేశారు. ఇక ఇంట్లోని గృహోపకరణాల విలువ మరో రూ.5.10 లక్షలుగా గుర్తించారు.

రూ.6.76 కోట్లకు పైగా ఆస్తులు.. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువే.!

స్థిరాస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు, పెట్టుబడులు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కలిపి మొత్తం విలువ సుమారు రూ.6.76 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే ఇవి అధికారికంగా లెక్కించిన విలువలు మాత్రమేనని, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

రూ.75 వేల లంచం దగ్గర మొదలైన కథ.. కోట్ల ఆస్తుల వరకు.!

గుండు వాణిపై ఇప్పటికే లంచం కేసు నమోదైంది. గత సెప్టెంబర్ 30న మొయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు కావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ లంచం కేసుతో వెలుగులోకి వచ్చిన అధికారిణి ఆస్తుల వ్యవహారం.. ఇప్పుడు కోట్ల రూపాయల పెట్టుబడులు, స్థిరాస్తుల వరకు చేరింది. ఇంత భారీగా ఆస్తులు ఎలా సమకూరాయి? వీటికి సంబంధించిన ఆదాయ వనరులేమిటి? అధికారిక ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ ఎంత? అనే కోణాల్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.


మీకు నచ్చవచ్చు: విజయ డెయిరీ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు.!

మీకు నచ్చవచ్చు: 14 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు..భార్యతో విడాకులు ప్రకటించిన మంత్రి ఆధవ్‌ అర్జున.! 

 

 

[ Gundu Vani, Telangana ACB, Anti Corruption Bureau, Disproportionate Assets, Bribery Case, Mooinabad Municipality, Town Planning Officer ]