GTA 6 Vice City Collection Box Set..గేమ్ లేని బాక్స్ సెట్ ధర రూ. 33,000 పైమాటే!
Published on: Fri Sep 25, 2026 10:13AM

గేమింగ్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (GTA 6) గురించి రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ ఒక సంచలనాత్మక ప్రకటన చేసింది. అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘Grand Theft Auto VI: The Goodtime State – Vice City Collection’ పేరుతో ఒక పరిమిత ఎడిషన్ మర్చండైజ్ బాక్స్ సెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ కలెక్టర్స్ బాక్స్ సెట్ చూసి నెటిజన్లు, గేమర్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే దీని ధర ఏకంగా 399 అమెరికన్ డాలర్లు (బ్రిటన్‌లో £349, ఆస్ట్రేలియా అంచనా ప్రకారం AU$660). భారత్ కరెన్సీలో లెక్కగడితే ఇది సుమారు రూ. 33,500 కంటే ఎక్కువ. ఇంత భారీ మూల్యం చెల్లించినా, ఈ రిచ్ కలెక్షన్ బాక్స్‌లో అసలైన GTA 6 గేమ్ డిస్క్ లేదా డిజిటల్ కోడ్ మాత్రం ఉండదు! గేమ్ కాపీని పూర్తిగా విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని రాక్‌స్టార్ గేమ్స్ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ ఫ్యాన్స్ కోసం సిద్ధం చేసిన ఈ ప్రెసియస్ మెర్చ్ బాక్స్‌ను రాక్‌స్టార్ స్టోర్‌లో ముందస్తుగా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ బాక్స్ సెట్‌లో లియోనిడా హిట్ టీవీ షో 'మ్యాకా ది గేటర్' థీమ్ ఆధారంగా రూపొందించిన పలు వినూత్న వస్తువులు ఉన్నాయి. ప్రధానంగా మ్యాకా ది గేటర్ ఫిగర్, ప్రీమియం ఓక్లీ ఫ్రాగ్‌స్కిన్స్ సన్‌గ్లాసెస్, లియోనిడా కీస్ క్రాస్‌బాడీ బ్యాగ్ మరియు న్యూ ఎరా 9FORTY స్నాప్‌బ్యాక్ హ్యాట్ వంటివి లభిస్తాయి. అంతేకాకుండా, మ్యాకా ది గేటర్ మాగ్నెటిక్ మిర్రర్, చంకీ ది మనాటీ షాట్ గ్లాస్, వైస్ సిటీ కలెక్టిబుల్ స్విజిల్ స్పూన్, వైస్ సిటీ రేజర్ బ్లేడ్ కీచైన్, మెటల్ టిన్ బాక్స్‌లో వచ్చే లియోనిడా కీస్ ఎనామెల్ పిన్ సెట్, స్టాష్ బ్యాగ్‌తో ఉన్న స్టిక్కర్ ప్యాక్ మరియు వైస్ సిటీ లేదా లియోనిడా మ్యాప్‌తో కూడిన రెండు వైపులా డిజైన్ ఉన్న సోవెనిర్ పోస్టర్ దీనిలో భాగమయ్యాయి.
ఈ కలెక్షన్ వివరాలు అధికారిక ప్రకటనకు ముందే 'videotech' అనే లీకర్ ద్వారా X (ట్విట్టర్) వేదికగా లీక్ అయ్యాయి. తొలత గేమర్లు దీనిని GTA 6 ఒరిజినల్ కలెక్టర్స్ ఎడిషన్ అని, ఇందులో గేమ్‌తో పాటు ఇతర గిఫ్ట్‌లు ఉంటాయని భావించారు. కానీ రాక్‌స్టార్ గేమ్స్ విడుదల చేసిన స్పష్టతతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆటగాళ్ళు కేవలం స్టాండర్డ్ మరియు అల్టిమేట్ ఎడిషన్లనే ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, నవంబర్ 19 న ఈ గేమ్ అధికారికంగా విడుదల కానుండటంతో, అంతకంటే ముందే మర్చండైజ్ బాక్స్‌ను నవంబర్ 19 కల్లా అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారు. రాక్‌స్టార్ గేమ్స్ ఇటీవలే 'Grand Theft Auto VI: The Album' పేరుతో అఫీషియల్ సౌండ్‌ట్రాక్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి గేమ్ లేకుండానే కేవలం మర్చండైజ్ కోసం రూ. 33,000 ఖర్చు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి?


