TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారానికి మళ్లీ పన్నుల సెగ: బ్యాంకుల మినహాయింపుపై జీఎస్టీ మండలి వేటు!

Published on: Tue Oct 6, 2026 10:16AM

దేశంలో పసిడి, వెండి, ప్లాటినం ప్రియులకు మరియు బులియన్ రంగానికి కీలకమైన మలుపు తిరిగే అవకాశ కనిపిస్తోంది. అక్టోబర్ 7న జరగనున్న అత్యున్నత జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వం గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీలు విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారం, వెండి, మరియు ప్లాటినంపై ఇప్పటివరకు ఇస్తున్న సమగ్ర వస్తు సేవల పన్ను (IGST) మినహాయింపును పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఈ విలువైన లోహాల దిగుమతిపై సాధారణంగా 3 శాతం ఐజీఎస్టీ వర్తిస్తుంది. అయితే, బ్యాంకులు మరియు నోటిఫైడ్ ప్రభుత్వ ఏజెన్సీలు దిగుమతి చేసుకున్నప్పుడు మాత్రం ఈ పన్ను నుండి ప్రత్యేకం మినహాయింపు లభిస్తోంది. 2017లో దిగుమతి ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు వర్తకాన్ని సులభతరం చేయడం కోసం ఈ వెసులుబాటును తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ మినహాయింపును ఉపసంహరించుకోవడం ద్వారా బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలను బులియన్ ఎక్స్చేంజీలతో సమానమైన పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

విదేశీ మారక నిల్వలు నిలకడగా ఉండటం, అలాగే అనవసరమైన విదేశీ కరెన్సీ తరలింపును అరికట్టడం ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే రెండవ అతిపెద్ద దేశం భారత్ కావడం గమనార్హం. మన దేశంలో పసిడి దిగుమతులకు ఆభరణాల తయారీ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండే ప్రధాన కారణం. గతంలోనే అవసరం లేని దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మే నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని (Import Duty) 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచగా, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 6.4 శాతం నుండి 15.4 శాతానికి పెంచింది. అంతేకాకుండా, ఇరాన్-యుఎస్-ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఆర్థిక అనిశ్చితి కారణముగా రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే పసిడి కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గణాంకాల వైపు ఒక్కసారి పరిశీలిస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు వ్యవధిలో భారతదేశ బంగారం దిగుమతులు వార్షికంగా 3.38 శాతం పెరుగుదలతో 17.47 బిలియన్ డాలర్లకు (USD 17.47 billion) చేరాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు మాత్రం 8.81 శాతం తగ్గి 1.74 బిలియన్ డాలర్లకు (USD 1.74 billion) పరిమితమయ్యాయి. ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యం భారీగా తరలిపోతుండటంతో, పన్ను సరళీకరణ పేరుతో లభిస్తున్న లొసుగులను అరికట్టడానికి జీఎస్టీ మండలి సన్నాహాలు చేస్తోంది. ఈ మినహాయింపు రద్దు అమల్లోకి వస్తే, బ్యాంకులు దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై కూడా పన్ను భారం పడుతుంది. ఇది నేరుగా బులియన్ మార్కెట్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణ వినియోగదారులు, స్వర్ణకారులు మరియు ఆభరణాల తయారీదారులు ఈ సమావేశ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

 

 

 

[GST Council, Gold Import, Silver Import, Platinum Import, IGST Exemption, Gold Import Duty, Bullion Market, Gold Prices India, Narendra Modi, Gold Imports India]