TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పన్ను అధికారులకు అరెస్టు అధికారాలు వద్దు: జీఎస్టీ కౌన్సిల్ కీలక సిఫారసు.!

Published on: Fri Oct 9, 2026 6:36AM

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జీఎస్టీ చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలపై అనవసరమైన ఒత్తిడిని తగ్గించడంతో పాటు పన్నుల వ్యవస్థను మరింత సరళంగా మార్చే దిశగా  పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.   కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 8)  జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను అధికారుల అరెస్ట్ అధికారాల తొలగింపు, ప్రాసిక్యూషన్ పరిమితి పెంపు, జరిమానాల తగ్గింపు వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయాలు ప్రస్తుతం కౌన్సిల్ చేసిన సిఫార్సులు కాగా, సంబంధిత చట్ట సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత అవి అమలులోకి వస్తాయి.

జీఎస్టీ చట్టం కింద పన్ను ఉల్లంఘనలకు సంబంధించి అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను పూర్తిగా తొలగించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఇందు కోసం సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69ను తొలగించాలని నిర్ణయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రికమెండ్ చేసింది. వ్యాపార కార్యకలాపాల్లో ఎదురయ్యే అనిశ్చితిని తగ్గించి, పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే  ఈ మార్పుల ముఖ్య ఉద్దేశంగా జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. అయితే, పన్ను ఎగవేత లేదా మోసాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వ్యవస్థ కొనసాగుతుంది.  

జీఎస్టీ నేరాలకు సంబంధించి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు వర్తించే పరిమితిని  కోటి రూపాయల నుంచి  5 కోట్ల రూపాయలకు పెంచాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీంతో తక్కువ మొత్తాలకు సంబంధించిన పన్ను వివాదాల్లో వ్యాపారులు ఎదుర్కొనే క్రిమినల్ చర్యల భారం తగ్గుతుంది. అయితే, ఈ మార్పు పన్ను చెల్లించాల్సిన బాధ్యతను రద్దు చేయదనీ,  పన్ను బకాయిల వసూలు, వడ్డీ, వర్తించే జరిమానాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 
 
అలాగే జీఎస్టీ చట్టంలోని సాధారణ గరిష్ఠ జరిమానాను పాతిక వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు తగ్గించాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. అలాగే, పన్ను నోటీసులు జారీ చేయడానికి కనీసం పది వేల రూపాయల మొత్తానికి సంబంధించిన పన్ను వివాదం ఉండేలా నిబంధనల్లో మార్పులు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ పరిమితికి దిగువన ఉన్న కొన్ని పెండింగ్ నోటీసులు, అప్పీళ్లకు కూడా కొత్త నిబంధనలు వర్తించేలా ప్రతిపాదన ఉంది. దీనివల్ల చిన్న మొత్తాల వివాదాలపై జరిగే అనవసరమైన న్యాయపరమైన ప్రక్రియలు తగ్గుతాయి.

పన్ను చెల్లింపుదారులకు రిఫండ్లు వేగంగా అందేలా వ్యవస్థ ఆధారిత ఆటోమేటిక్ విధానాలను విస్తరించాలనీ,  అర్హత కలిగిన కొన్ని రిఫండ్ దరఖాస్తుల్లో, నిబంధనలకు లోబడి, క్లెయిమ్ చేసిన మొత్తంలో 90 శాతాన్ని తాత్కాలికంగా విడుదల చేసే విధానాన్ని కూడా అమలులోకి తీసుకు రావాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది.  జీఎస్టీ రిజిస్ట్రేషన్, వివరాల సవరణ, రిటర్నుల దాఖలు వంటి ప్రక్రియల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించి, ఆన్‌లైన్ వ్యవస్థను మరింత సులభతరం చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. 

ఈ-కామర్స్ వేదికల ద్వారా ఇతర రాష్ట్రాల్లో వస్తువులు విక్రయించే చిన్న వ్యాపారులకు సులభమైన జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురావాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. వార్షిక టర్నోవర్  5 కోట్ల రూపాయల వరకు ఉన్న చిన్న వినియోగదారుల వ్యాపారాల కోసం ఐచ్ఛిక పథకాన్ని సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ చర్యలు చిన్న వ్యాపారాల నిర్వహణ వ్యయాన్ని, పన్ను నిబంధనల అనుసరణ భారాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే నిర్ణయించిన రేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ, రిజిస్ట్రేషన్, రిఫండ్లు, నోటీసులు, వివాదాల పరిష్కారం వంటి పరిపాలనా అంశాల్లో సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు.   

[GST Council Decisions, GST Council, GST Arrest Powers, GST Rules Changes, GST Taxpayers, GST Prosecution, Telugu One]