TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.99 లక్షల కోట్లు.!

Published on: Wed Sep 2, 2026 3:37PM

దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. బలోపేతమౌతోంది. ఇందుకు తాజా ప్రత్యక్ష తార్కానంగా ఈ ఏడాది ఆగస్టు నెలలో వస్తుసేవల పన్ను అంటేజీఎస్టీ వసూళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరిగాయి.  దేశవ్యాప్తంగా మొత్తం జీఎస్టీ వసూళ్లు  లక్షా 99 వేల 853 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

గతేడాది ఇదే నెలలో నమోదైన లక్షా74 వేల 116 కోట్ల రూపాయలతో పోలిస్తే  పోలిస్తే ఇది   14.8 శాతం అధికం. ఇదే సమయంలో ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తలకిందులు చేస్తూ 7.8 శాతంగా నమోదవ్వడం విశేషం. ఈ రెండు బలమైన అంశాలను బేరీజు వేసుకుని దేశ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

అయితే.. ప్రచారంలో ఉన్న ఈ గణాంకాల వెనుక మరికొన్ని  వాస్తవాలు దాగి ఉన్నాయి.  స్థూలంగా వసూలైన రూ. 1.99 లక్షల కోట్ల రూపాయలలో, వ్యాపారులకు చెల్లించాల్సిన రీఫండ్లను మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం  లక్షా 68 వేల 57 కోట్ల రూపాయలు మాత్రమే.  అంటే నికర వృద్ధి రేటు  8.3 శాతంగానే నమోదైంది.

గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రీఫండ్లు దాదాపు 67.9 శాతం పెరిగి రూ. 31,795 కోట్లకు చేరడమే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం. ఇక గృహ వినియోగ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 9.3 శాతం పెరిగి రూ. 1,37,249 కోట్లకు చేరగా, దిగుమతులపై వచ్చే పన్ను రాబడులు  ఏకంగా 29 శాతం ఎగబాకి రూ. 62,604 కోట్లను తాకాయి. 

దీనివల్ల గృహ వినియోగ వసూళ్లతో పోలిస్తే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.  2017 జూలై 1న ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థ క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ప్రారంభ రోజుల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కేవలం 65 లక్షల లోపు ఉండగా, ప్రస్తుతం అది కోటీ యాభై లక్షలకు పైగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణలు, ఈఇన్వాయిసింగ్ విధానం వంటి సాంకేతిక మార్పుల కారణంగా పన్ను ఎగవేతలు తగ్గి వ్యవస్థలోకి కొత్త వ్యాపారాలు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

మరోవైపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటివరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ 2.0'సంస్కరణల నేపథ్యంలో పన్ను శ్లాబులను సరళతరం చేయడం జరిగిందని, కొన్ని నిత్యావసరాలు, బీమా రంగాలపై పన్నులను కూడా మినహాయించినట్లు తెలుస్తోంది.  ఈ సానుకూల పరిణామాలతో పాటు, కొన్ని ఆర్థిక సూచికలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు  రికార్డు స్థాయిలో 729.33 బిలియన్ డాలర్లకు చేరుకోవడం, ఆటోమొబైల్ రంగంలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పుంజుకోవడం శుభపరిణామం. అయితే, తయారీ రంగంలో వృద్ధిని సూచించే పీఎంఐ (PMI) గణాంకాలు మరియు స్టాక్ మార్కెట్లలో నెలకొన్న మందగమనం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడో నమోదైన గరిష్ట స్థాయిలను ప్రస్తుత విజయాలుగా చూపించడం సరికాదని, తయారీ రంగంలో ఉద్యోగావకాశాలు మరియు కొత్త ఆర్డర్ల వేగం మందగించిన మాట వాస్తవమని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు.  రాబోయే రోజుల్లో జీఎస్టీ విధానపరమైన అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో పన్నుల సరళీకరణతో పాటు, రీఫండ్ల ప్రక్రియను వేగవంతం చేయడం, ట్రిబ్యునల్  ప్రాంతీయ బెంచ్‌ల పనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పన్నుల వసూళ్లలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, దాన్ని మరింత సుస్థిరం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. దేశ ఆర్థిక పురోగతికి పన్నుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

 -సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[GST collections August 2026, India GST revenue, GST 2.0 reforms, Q1 GDP growth 7.8 percent, Indian economy updates]