పర్యావరణ బంధువులు.. రాబందులు.. ఆరు దశాబ్దాల తరువాత రీఎంట్రీ.!
Published on: Mon Sep 21, 2026 9:45AM

ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించే జీవవైవిధ్య సంపదలో కీలకమైన రాబందులు మళ్లీ ఎంట్రీ ఇచ్చాయి. దాదాపుగా అంతరించిపోయిన.. దాదాపు గ్రిఫాన్ రాబందులు అరవైఏళ్ల తరువాత తమ పూర్వీకుల ఆవాస ప్రాంతాలకు చేరుకున్నాయి. బల్గేరియాలోని వ్రాచన్స్కి బాల్కన్ నేచురల్ పార్క్ ఆకాశంలో ఒకప్పుడు విరివిగా, స్వేచ్ఛగా సంచరించి, కాలక్రమేణా పూర్తిగా కనుమరుగైపోయిన ఈ పక్షి జాతికి శాస్త్రవేత్తలు జీవం పోశారు. పర్యావరణ నిపుణులు పట్టుదలతో చేపట్టిన ఒక దశాబ్ద సుదీర్ఘ పునరుద్ధరణ ప్రణాళిక సఫలం కావడంతో, ఇప్పుడు బల్గేరియన్ ఆకాశంలో గ్రిఫాన్ రాబందులు స్వేచ్ఛగా విహరిస్తూ స్థానికులను, వన్యప్రాణి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.
ఇరవయ్యవ శతాబ్దపు నాలుగో దశకం వరకు బల్గేరియాలో గ్రిఫాన్ రాబందులు పెద్ద సంఖ్యలో ఉండేవి. అయితే.. 1950ల నాటికి ఈ రాబందులకు పెను ముప్పు ముంచుకొచ్చింది. అటవీ ప్రాంతాలలో క్రూర మృగాల బెడదను నివారించడానికి, అలాగే పశువులను రక్షించుకోవడానికి కొందరు వ్యక్తులు చల్లిన విష పదార్థాలను రాబందులు ఆహారంగా తీసుకోవడంతో మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోయాయి. దీనికితోడు ఆవాసాల ధ్వంసం వంటి కారణాలతో., 1970 నాటికి బల్గేరియాలో రాబందుల జాడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు బల్గేరియాలో ఈ జాతిని మళ్లీ ప్రవేశపెట్టాలని దృఢ సంకల్పంతో బృహత్తర ప్రాజెక్టు చేపట్టారు.

ఈ ప్రణాళికను అమలు చేసేందుకు వ్రాచన్స్కి బాల్కన్ నేచర్ పార్క్ అనువైన ప్రాంతంగా నిర్ణయించారు. ఇక్కడ ఉన్న కొండచరియలు, రాబందులు గూళ్లు కట్టుకునేందుకు తగిన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి, బ్లూప్రింట్ సిద్ధం చేశారు.
ఈ పునరావాస కార్యక్రమంలో భాగంగా స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల నుంచి.. అలాగే వివిధ యూరోపియన్ జూ పార్కుల నుంచి పునరావాసం కల్పించిన గ్రిఫాన్ రాబందులను బల్గేరియాకు రప్పించారు. మొత్తం మీద 2010 నుంచి 2020 మధ్య కాలంలో 61 రాబందులను ఈ నేచురల్ పార్క్‌కు తీసుకువచ్చి విడుదల చేశారు. అయితే, కొత్త వాతావరణానికి ఆ పక్షులు అలవాటు పడేందుకు భారీ బోన్లను ఏర్పాటు చేసి వాటిలో ఉంచి సంరక్షించారు. ఆ తర్వాత పద్ధతి ప్రకారం వాటిని నెమ్మదిగా ప్రకృతిలోకి విడిచిపెట్టారు.
సహజ వాతావరణంలోకి వెళ్లిన ఈ పక్షులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు వాటి రెక్కలకు ప్రత్యేకమైన ట్యాగ్‌లు, మెటల్ రింగులను అమర్చి పర్యవేక్షించారు. అంతే కాకుండా, వాటికి ఆహార కొరత ఏర్పడకుండా కొండ ప్రాంతాల్లోని ప్రత్యేక ప్రదేశాలలో వారానికి కనీసం రెండుసార్లు మేకలు, పందులు, గుర్రాలు వంటి పెంపుడు జంతువుల వ్యర్థాలను ఆహారంగా అందించారు. ఈ సంరక్షణ చర్యల ఫలితంగా రాబందులు సంతానోత్పత్తి మొదలై వాటి సంఖ్య పెరిగింది. . 2013 నాటికి అటవీ ప్రాంతంలో వీటి సంతానోత్పత్తికి సంబంధించిన తొలి సంకేతాలు కనిపించగా, 2015లో మొదటిసారిగా అడవిలో ఒక రాబందు జన్మించి ఎగరడం ప్రారంభించింది.
క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చి, 2016 నుండి 2020 మధ్య మొత్తం 42 రాబందు కూనలు విజయవంతంగా ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగిరే స్థాయికి చేరుకున్నాయి. 2020 నాటికి ఈ పార్క్‌లో సుమారు 70 వరకు గ్రిఫాన్ రాబందులు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ విజయం పర్యావరణ పరిరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు.
[Griffon Vultures Bulgaria, Vrachanski Balkan Nature Park, Vulture Reintroduction Programme, Wildlife Conservation Europe, Endangered Birds Restoration]


