TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పచ్చ, నల్ల ఎండు ద్రాక్షలో ఏది బెస్ట్.. తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.!

Published on: Thu Sep 24, 2026 2:45PM

ఎండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మార్కెట్‌లో మనకు రకరకాల ఎండు ద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పచ్చగా లేదా బంగారు రంగులో ఉండే ఎండు ద్రాక్షలు, అలాగే నల్లటి ఎండు ద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటిలో ఏది తినాలి, దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. నిజానికి రెండిట్లోనూ ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయి. కానీ తయారు చేసే విధానం, వాడే ద్రాక్ష రకం ఆధారంగా వీటి రంగుతో పాటు వాటిలోని గుణాలు, అందించే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే..

పచ్చ లేదా బంగారు రంగు ఎండు ద్రాక్ష..

పచ్చటి లేదా బంగారు రంగు ఎండు ద్రాక్షలను సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని త్వరగా ఎండబెట్టడానికి, వాటి రంగు మారకుండా ఉండటానికి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. తియ్యటి రుచితో ఉండే ఇవి పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచి ఆహారం.

నలుపు ఎండు ద్రాక్ష..

నల్లటి ఎండు ద్రాక్షలను నల్లటి ద్రాక్ష పండ్ల నుంచి సహజ సిద్ధంగా ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. సహజంగా ఎండడం వల్ల వీటి రంగు నల్లగా మారుతుంది. వీటికి నల్లటి రంగును ఇచ్చే ఆంథోసైనిన్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి నల్ల ఎండు ద్రాక్షలు ఎంతగానో దోహదపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. జుట్టు రాలడం తగ్గడం, చర్మం పై ముడతలు త్వరగా రాకుండా చూడటం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ప్రత్యేక ప్రయోజనాలు నల్లటి ఎండు ద్రాక్షల ద్వారా లభిస్తాయి.

ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది?

రెంటికీ వాటి ప్రత్యేక స్థానం ఉంది.  తక్షణ శక్తి కావాలన్నా,  మంచి జీర్ణక్రియ, సులువైన ఐరన్ పోషణ కావాలంటే పచ్చటి ఎండు ద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ గుండె ఆరోగ్యం, అధిక రక్తపోటు నియంత్రణ, ఎముకల బలం, జుట్టు , చర్మ సంరక్షణ వంటి విషయాల్లో నల్లటి ఎండు ద్రాక్షలు కాస్త ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. నల్లటి ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో ఇవి ముందంజలో ఉంటాయి.

కాబట్టి రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు.  శరీర అవసరాలను బట్టి రెండింటినీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే వాటిలోని పోషకాలు శరీరానికి మరింత త్వరగా అందుతాయి. నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. పరిమితికి లోబడి ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం  సొంతమవుతుంది.

                     *రూపశ్రీ.