TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత: సుప్రీం కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి క్షమాపణ.!

Published on: Thu Oct 15, 2026 3:35PM

ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో  ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఈ చర్యపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌.. సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణ చెప్పారు. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన తన అఫిడవిట్‌లో వివరించారు. భవిష్యత్తులో అవసరమైన పరిస్థితుల్లో చట్టబద్ధంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసేందుకు వీలుగా కోర్టు డైరెక్షన్స్ ఇవ్వాలని కూడా కోరారు. 

 విషయం ఏమిటంటే.. అక్టోబర్‌ 10న ఢిల్లీలో  నిరసనలకు సీజేపీ  పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికా రులు ఆంక్షలు విధించారు.   ప్రజా రవాణా, ఇంటర్నెట్‌ సేవలు, ప్రజల స్వేచ్ఛగా రాకపోకలు నిర్వహిం చడంపై   ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

అక్టోబర్‌ 11న సుప్రీంకోర్టు ఢిల్లీలో మెట్రో, రైలు సేవలు సాధారణంగా కొనసాగాలని, ఇంటర్నెట్‌ సదుపాయాలకు ఆటంకం కలగకూడదని, ప్రజల రాకపోకలకు అనవసరంగా అడ్డంకులు సృష్టించకూడదని సుప్రీం ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీనిపై సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో గోవింద్‌ మోహన్‌  రైసినా హిల్స్‌ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో అక్టోబర్‌ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్‌ 10 రాత్రి 10 గంటల వరకు సెల్యులార్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఢిల్లీ పోలీసుల నుంచి వచ్చిన అభ్యర్థనను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిరసనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటానికి, పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యను సముచితమైనదిగా భావించామని హోం కార్యదర్శి వివరించారు. అయితే, ఈ ఆంక్షలు మొబైల్‌ ఇంటర్నెట్‌కే పరిమితమయ్యాయని, వై ఫై, బ్రాడ్‌బ్యాండ్‌ వంటి ఇతర సేవలను నిలిపివేయలేదని స్పష్టం చేశారు.

 ఒక వైపు క్షమాపణ కోరుతూనే  గోవింద్‌ మోహన్‌  పరిమిత ప్రాంతంలో, నిర్దిష్ట సమయం వరకు, చట్టపరమైన నిబంధనలకు లోబడి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం కొన్ని సందర్భాల్లో ప్రజా శాంతిని కాపాడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చట్టం, సంబంధిత భద్రతా నిబంధనలను పాటిస్తూ ఇలాంటి చర్యలు తీసుకునే వీలుండేలా అక్టోబర్‌ 11న ఇచ్చిన ఆదేశాలను  సవరించాలని కోరారు.  

సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భవిష్యత్తులో ఇంటర్నెట్‌ నిలిపివేతకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు వెలువడతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.  అక్టోబర్‌ 15న ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.  


[Govind Mohan Appologies to Supreme Court, Delhi Internet Suspension, Union Home Secretary, Contempt Court, Delhi Protests, Mobile Internet Shutdown, Telugu One]