TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారంతో ఆభరణాలే కాదు, రోడ్డు కూడా: దుబాయ్ లో గోల్డెన్ వాక్ వే.!

Published on: Thu Oct 29, 2026 11:08AM

పసిడి ప్రియులను అబ్బురపరిచేలా దుబాయ్ లో గోల్డెన్ వాక్ వే రూపుదిద్దుకుంటోంది. మామూలుగా బంగారాన్ని ఆభరణాలు, గృహోపకరణాలు,  విలాసవంతమైన వస్తువుల తయారీలోనే వినియోగిస్తుంటారు. కానీ వినూత్నంగా 24 క్యారెట్ బంగారంలో ఏకంగా ఒక రోడ్డు నిర్మించాలని దుబాయ్ సంకల్పించింది.  అంతర్జాతీయంగా పసిడి వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన దుబాయ్ లో  గోల్డెన్ వాక్ వే ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఈ రోడ్డు సాకారమైతే..  ప్రపంచంలోనే  తొలి సారిగా పూర్తి బంగారంతో  నిర్మించిన నడకదారి ఇదే అవుతుంది.  

ఈ గోల్డెన్ వాక్ వే దుబాయ్‌లోని   గోల్డ్ డిస్ట్రిక్ట్ లో నిర్మించనున్నారు. పసిడి ఆభరణాలు, మెరిసే వజ్రాలు, ఖరీదైన గడియారాలు,  విలువైన రత్నాల వ్యాపారానికి  పేరొందిన గోల్డ్ డిస్ట్రిక్ట్ కు ఈ గోల్డెన్ వాక్ వే మరింత ప్రత్యేకత సంతరించుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ గోల్డెన్ వాక్ వే పూర్తయితే.. ఇదొక పర్యాటక అద్భుతంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని పరిశీలకులు అంటున్నారు. బంగారాన్ని చూడటం, బంగారు ఆభరణాలు ధరించడం మాత్రమే కాదు, పూర్తిగా బంగారంతో నిర్మించిన రోడ్డుపై నడిచి కొత్త అనుభూతిని సొంతం చేసుకోవడానికి పర్యాటకు పోటెత్తడం ఖాయమంటున్నారు.  

ప్రస్తుతం గోల్డెన్ వాక్ వే ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలు జోరుగా సాగుతున్నాయి. రాబోయే కాలంలో పర్యాటక రంగాన్ని మరింత ఉత్తేజితం చేసే దిశగా ఈ వాక్ వే నిర్మితమౌతోంది. ఈ గోల్డెన్ వాక్ వే పొడవు, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇందు కోసం వినియోగించే బంగారం పరిణామం అన్న విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఈ గోల్డెన్ వాక్ వే నిర్మాణంలో  బంగారాన్ని ఏ పద్ధతిలో, ఏ రూపంలో వినియోగించాలి, ఎంత మంది ఈ గోల్డెన్ వాక్ వే పై నడిచినా పసిడి మెరుపులు చెక్కుచెదరకుండా ఉండేలా నిపుణుల పర్యవేక్షణలో డిజైన్లు రూపొందుతున్నాయి.

దుబాయ్‌లో పసిడి వ్యాపార వృద్ధికి ఈ ప్రాజెక్ట్   ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో బంగారం టోకు వ్యాపార కార్యాలయాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న వ్యాపార సంస్థలు,  రిటైల్ దుకాణాల సంఖ్య కూడా నిలకడగా వృద్ధి చెందుతున్నాయి.  రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను మరింత విస్తరించేందుకు,  అంతర్జాతీయ స్థాయి నగల ప్రదర్శనలను నిర్వహించేందుకు కూడా   ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక గోల్డెన్ వాక్ వే నిర్మాణం కూడా పూర్తయితే..  దుబాయ్ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం అవుతుందనడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.  ఈ గోల్డెన్ వాక్ వే  అందుబాటులోకి వస్తే..  అది కేవలం ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పసిడి ప్రియులను ఆకర్షించే   గమ్యస్థానంగా మారుతుందనడంలో సందేహిం లేదు.  

 [Gold Walk Way Road Dubai,  Gold District, 24 Carat Gold Walkway, Dubai Tourism, Gold Business, Gold Lovers, Destination, Telugu One]