TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోల్డ్ లోన్‌ తీసుకున్న వారికి షాక్..ఎందుకంటే.!

Published on: Mon Nov 23, 2026 3:58PM

బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. మార్కెట్‌లో బంగారం విలువ తగ్గడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ ఖాతాదారులకు మార్జిన్ కాల్ నోటీసులు పంపుతున్నాయి. తీసుకున్న అప్పులో కొంత మొత్తం వెంటనే చెల్లించాలని.. లేదంటే అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని సూచిస్తున్నాయి.

గతంలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు రుణాలు తీసుకున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. రూ.2 లక్షల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు బంగారం ధర తగ్గడంతో ఆ తనఖా బంగారం విలువ రూ.1.60 లక్షలకు పడిపోతే.. బ్యాంకుకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ మాత్రం తగ్గవు. దీంతో రుణ మొత్తానికి, తనఖా బంగారం విలువకు మధ్య ఉండాల్సిన వ్యత్యాసం తగ్గిపోతుంది.

దీనినే ఆర్థిక పరిభాషలో లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి పెరగడం అంటారు. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాకట్టు పెట్టిన బంగారం విలువ ఆధారంగా నిర్ణీత పరిమితి వరకు రుణాలు మంజూరు చేస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల వరకు రుణాలకు 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం వరకు ఎల్‌టీవీ పరిమితి వర్తిస్తుంది.

అయితే గోల్డ్ రేటు ఒక్కసారిగా పడిపోవడంతో ఈ నిష్పత్తి నిర్దేశిత పరిమితిని దాటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో బ్యాంకులు అప్రమత్తమవుతున్నాయి. రుణగ్రహీతలు కొంత నగదు చెల్లించి అప్పు తగ్గించుకోవాలని లేదా అదనపు బంగారాన్ని తనఖా పెట్టాలని మార్జిన్ కాల్స్ ద్వారా హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు బంగారం ధరలు మరింత పడిపోతే రుణాల రికవరీ కష్టమవుతుందనే ఆందోళన కూడా ఆర్థిక సంస్థల్లో నెలకొంది. తనఖా బంగారం విలువ తగ్గడం ప్రస్తుతం సవాలుగా మారిందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రతినిధి మయాంక్ శర్మ పేర్కొన్నారు. ఇటీవలి ధరల పతనం తర్వాత బంగారం వేలం ప్రక్రియలు కూడా పెరిగాయని ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ వెల్లడించారు.

ఇది కూడ చదవండి:  ఫోన్ చేసి బయటకు పిలిచారు.. సింగరేణి ఉద్యోగిని చంపేశారు.!

ముఖ్యంగా అత్యవసర అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టిన మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులకు ఈ పరిణామం భారంగా మారే అవకాశం ఉంది. అదనపు నగదు సర్దుబాటు చేయలేకపోతే రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే.. నిబంధనల ప్రకారం బ్యాంకులు తనఖా బంగారాన్ని వేలం వేసే పరిస్థితి రావచ్చు.

అందుకే గోల్డ్ లోన్ తీసుకున్నవారు బ్యాంకుల నుంచి వచ్చే మార్జిన్ కాల్ సందేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. తమ రుణ ఖాతాలో ఉన్న బకాయిలు, వడ్డీ, ఎల్‌టీవీ నిష్పత్తిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. బంగారం ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే.. తాకట్టు పెట్టిన పసిడిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: కరీంనగర్ నా కాషాయ అడ్డా:  కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్.!

మీకు నచ్చవచ్చు: 24 ఏళ్లకే ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత.. టీడీపీ కూటమి సంచలన నిర్ణయం

 

 


[ Gold Loan, Gold Price Crash, Margin Calls, Loan To Value Ratio, RBI Gold Loan Rules, Gold Auction, Gold Loan Borrowers ]