TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరద ఉధృతి: పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. ధవళేశ్వరం వద్ద డేంజర్ బెల్స్.!

Published on: Sat Sep 26, 2026 10:15AM

రాష్ట్రంలో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో మరోసారి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో రాజమహేంద్రవరం సమీపంలోని సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం అంతకంతకూ హెచ్చవుతోంది.

ప్రస్తుతం బ్యారేజీ వద్దకు చేరుతున్న నీటి ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా నమోదైంది. ఇదే రీతిలో వరద పోటు కొనసాగితే నేడు రాత్రికి బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని జారీ చేసే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోందని, దీనివల్ల గంటగంటకూ నీటి మట్టం పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అప్రమత్తమైంది. వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రధానమైన ఆరు జిల్లాల కలెక్టర్లకు మరియు క్షేత్రస్థాయి యంత్రాంగానికి తక్షణ అప్రమత్తత ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటి మునిగే ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు నదిలో స్నానాలకు వెళ్లడం, ఈత కొట్టడం,  చేపల వేట కోసం వెళ్లడం వంటి సాహసాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. 

 వరద మరింత ఉద్ధృత రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.    నదీతీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి అధికారిక సూచనలను పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరింది.


[Godavari Floods, Dhavaleswaram Barrage, 1st Danger Caution,  Godavari Water Level, Andhra Pradesh Rains, Telugu One]