గోదావరి వరద ఉధృతి: ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్.. నీట మునిగిన మిర్చి పంట.!
Published on: Mon Sep 28, 2026 1:09PM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతం చిగురుటాకులావ ణికిపోతోంది. గోదావరి, శబరి నదులలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు ముంపు ముప్పు అంచున ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కూనవరం ప్రాంతం వద్ద గోదావరి నీటి మట్టం ఇప్పటికే 43.5 అడుగులకు చేరుకుంది. ఇహనో ఇప్పుడో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
చింతూరు వద్ద ప్రవహిస్తున్న శబరి నది నీటి మట్టం 37.5 అడుగులకు చేరింది. వరద ఉధృతి కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మురుమూరు ప్రాంతంలోని ప్రధాన రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చొచ్చుకురావడంతో భద్రాచలం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే చింతరేవుపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చింతూరు వద్ద జాతీయ రహదా పైకి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

ఈ వరదలకు ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం తదితర ప్రాంతాలలో వందలాది ఎకరాల మిర్చి పంట నీట మునిగింది. ఇక ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. బాధితులకు ఆహారం, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
[Godavari Flood, Chintoor Agency Floods, Godavari and Sabari Water Level, AP Floods, Polavaram, Telugu One]


