గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్: దిగజారిన ఇండియా ర్యాంక్.!
Published on: Fri Nov 13, 2026 9:30AM

అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల పర్యావరణ పరిరక్షణ చర్యలు, వాతావరణ మార్పుల నియంత్రణ పనితీరును అంచనా వేసే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ జాబితాలో ఇండియా 28వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే.. ఐదు స్థానాలు దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 దేశాలు, యూరోపియన్ యూనియన్ పనితీరును విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో భారత్ ఐదు స్థానాలు దిగజారి 28వ స్థానంలో నిలిచింది.
టర్కీలోని అంటాల్య వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఈ వార్షిక నివేదికను ప్రకటించాయి. మొత్తం 60.85 పాయింట్లతో భారత్ తన స్థానంలో వెనుకబడినప్పటికీ, ఓవరాల్ రేటింగ్‌లో మాత్రం మధ్యస్థ కేటగిరీని మాత్రం నిలుపుకోగలిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిందేంటంటే.. ఇండియా రెండేళ్లలో ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఏకంగా 18 స్థానాలు దిగజారింది. 2024లో ఇండియా 10వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ స్థానం 23కు పడిపోయింది. తాజాగా 28వస్థానంలో నిలిచింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలో గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియా ఏకంగా 18 స్థానాలకు దిగజారిందన్నమాట.
గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు, ఇంధన వినియోగం, పర్యావరణ హిత విధానాల విధానాల అమలు వంటి అంశాల్లో ఇండియా మరింత మెరుగుపడాల్సిన ఆవశ్యకతను తాజా నివేదిక తేటతెల్లం చేసింది. అన్నిటికీ మించి 2024లో పదో స్థానంలో నిలిచిన ఇండియా రెండేళ్ల వ్యవధిలోనే 28వ స్థానానికి దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. 2024లో విడుదలైన నివేదికలో ప్రపంచంలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి పది దేశాల జాబితాలో భారత్ సగర్వంగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏడాది అంటే 2025లో ఏకంగా 13 స్థానాలు కోల్పోయి 23వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఐదు స్థానాలు దిగజారింది.

సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణలో భారత్ వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఇంకా ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన అవసరాలకు తగ్గట్టుగా కర్బన ఉద్గారాల తగ్గింపు వేగం లేకపోవడం, విద్యుత్ సరఫరా, నిల్వ సామర్థ్యాలలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు భారత్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఇది కూడా చదవండి: చలి చంపేస్తోంది.. ఎండలు మాడ్చేస్తాయి.. వాతావరణ మార్పులతో జనం బెంబేలు
పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ట్రెండ్‌లో భారత్‌కు హై రేటింగ్ దక్కినప్పటికీ, ఇతర విభాగాల్లో ఆశించిన పురోగతి కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతానికి పైగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే 64 దేశాలు, యూరోపియన్ యూనియన్ల పనితీరును నాలుగు ప్రధాన విభాగాల కింద 14 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్ మదింపు చేస్తుంది. విశేషమేమిటంటే, ఏ దేశం కూడా అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈసారి కూడా మొదటి మూడు ర్యాంకులను ఖాళీగా ఉంచారు.

ఈ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో డెన్మార్క్ అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లిథువేనియా, లక్సెంబర్గ్, యూకే నిలిచాయి. అమెరికా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.భవిష్యత్తులో భారత్ తన ర్యాంకింగ్‌ను తిరిగి మెరుగుపరుచుకోవాలంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్రిడ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం, పారిశ్రామిక ఉద్గారాలపై కఠినమైన నియంత్రణ విధించడం మరియు వాతావరణ అనుకూల విధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే అంతర్జాతీయ వేదికపై భారత్ మళ్లీ టాప్-10 జాబితాలోకి చేరుకునే అవకాశం ఉంటుందని పర్యావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చవచ్చు: తెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్: హైదరాబాద్ పై చలిపులి పంజా.
సూపర్ ఎల్ నినో భయం: భారత్‌లో 15,800 మంది ప్రాణాలకు ముప్పు?
[GlobalClimateIndex, IndianRank, Decrease, Twoyears, Drop, TeluguOne]


