ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు తొలగింపు?

గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

పొత్తులో భాగంగా జనసేన రాష్ట్రంలో 21 అసెబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలలో  కూటమిలోని మిగిలిన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీలో లేని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును  ఇతరులెవరికీ కేటాయించవద్దని కోరుతూ తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొన్నది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ను కోరామని పేర్కొంది. జనసేన పోటీ లో లేకపోయినా ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడం వల్ల నష్టం జరుగుతుందనీ, ఓటర్లలో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందనీ పేర్కొంది. ముఖ్యంగా జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్లుగా నిలబడిన రెబల్ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించడం కూటమి అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.  

దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇటువంటి వినతులపై 24 గంటలలో నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు జనసేన పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే అంశంపై తెలుగుదేశం కూడా సప్లిమెంటరీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోలేదనీ, ఏమీ చెప్పకపోవడం అంటే నిరాకరించడం కాదనీ పేర్కొనడాన్ని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణను బుధవారం (మే1)కి వాయిదా వేసింది.