దేశ ఆర్ధిక రాజధానిలో మరో ఘోరం

 

దేశంలో అత్యాచారాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. డిల్లీలో నిర్భయ ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే ఇప్పుడు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా మీడియా ప్రతినిధి పైనే సామూహిక అత్యాచారం జరిగింది.

ముంబైలో ఫోటో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న 22 ఏళ్ల యువతిపై గురువారం సాయంత్రం ఐదుగురు దుర్మార్గులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నగరంలోని ఓ పాత మిల్లులొ కవరేజ్‌కి వెళ్లిన యువతిని ఆమె సాహాయకున్ని బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలిస్‌ 20 స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకడిని అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు అతడి నుంచి మిగతా వారి వివరాలు సేకరించారు.

ఈ విషయాన్ని కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ముంబై పోలిస్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఘటనపై సమగ్రనివేదిక అందిచాలని కోరారు. వీలైనంత త్వరగా కేసును పూర్తి చేసి నింధితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.