TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం.!

Published on: Thu Sep 17, 2026 9:59AM

గణేష్  నిమజ్జన వేడుకలో   విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాలతో సాగాల్సిన సంబరాల్లో జరిగిన అపశ్రుతి విషాదాన్ని నింపింది. . వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  

సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి సమీపంలో ఉన్న నేరేడు చెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కొంతమంది విద్యార్థులు బృందంగా వెళ్లారు. అయితే..  చెరువులో మట్టి తవ్వకాల కారణంగా ఏర్పడిన లోతైన గుంతలను వారు ముందుగా గుర్తించలేకపోయారు. విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లే క్రమంలో  వారు గుంతలో పడి మునిగిపోయారు.  సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు స్థానిక శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన వారిగా   గుర్తించారు. మృతులలో నర్సింహా రాజు (బీటెక్), సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్), గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్), శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్) అలాగే పదవ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

 

ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్  శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  పలువురు ప్రముఖులు   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు  విచారణ చేపట్టారు. ట్రస్ట్ నిర్వాహకులను విచారించడం తోపాటు చెరువుల వద్ద భద్రతా లోపాలపై ఆరా తీస్తున్నారు. 

ఉత్సవాల సమయంలో తగినంత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద నిమజ్జన వేడుకల సమయంలో స్థానిక యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమని అంటున్నారు.  

[Ganesh immersion tragedy, six students dead, Shirisha Charitable Trust, Sangareddy District, Telugu One]