TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఏడాది చివరిలో భారత్ గగన్ యాన్ ప్రయోగం.. ఇస్రో చైర్మన్ వెల్లడి.!

Published on: Fri Sep 4, 2026 10:17AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్'ప్రయోగానికి సంబంధించిన కీలక వివరాలను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి మానవ రహిత యాత్రను ఈ ఏడాది చివరి నాటికి నిర్వహించేందుకు సమాయత్తమౌతున్నట్లు చెప్పారు.  అంతరిక్ష రంగంలో ఇండియా సత్తా  ప్రపంచానికి చాటిచెప్పే దిశగా ఇస్రో ఇంజనీర్లు,  శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారన్న ఆయన,  గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ప్రణాళికాబద్ధంగా తొలి దశ మానవ రహిత ప్రయోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి చేపట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.  ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి  వ్యోమమిత్ర అనే హాఫ్ హ్యూమనాయిడ్ రోబోను పంపనున్నట్లు వివరించారు. వ్యోమగాములు ప్రయాణించే సమయంలో క్యాబిన్ లోపలి వాతావరణ పరిస్థితులు, వారి శరీర కదలికలకు తగినట్లుగా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయనే విషయాలను ఈ రోబో పరిశీలించి  నియంత్రణ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తుంది.

మానవులను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపే ముందు ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు, ఇస్రో   భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మానవ సహిత యాత్రకు ముందే మొత్తం మూడు మానవ రహిత ప్రయోగాలను నిర్వహించనుంది. లాంచ్ వెహికల్ హ్యూమన్ రేటింగ్ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. అలాగే వ్యోమగాముల భద్రతను రక్షించే క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ రూపకల్పన కూడా పూర్తయ్యింది. 

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు వివిధ రకాలుగా దాదాపు 8 వేల పరీక్షలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు ఇస్రో చైర్మన్ వివరించారు.  క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ అసెంబ్లీ మరియు వాటి సమగ్ర పరీక్షలు తుది దశకు చేరుకున్నాయన్నారు. 

భూమికి  నాలుగువందల  కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ముగ్గురు భారత వ్యోమగాములను పంపి, అక్కడ మూడు రోజుల పాటు వారిని సురక్షితంగా ఉంచి, ఆ తర్వాత తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావడమే గగన్‌యాన్ టాస్క్. ఈ మిషన్ కోసం ఎంపిక చేసిన వ్యోమగాములకు  ఇప్పటికే రష్యాలో జనరల్ శిక్షణ  పూర్తి అయ్యింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో  శిక్షణను పొందుతున్నారు.  

[Gaganyaan mission by Year End, ISRO Chairman, Vyommitra robot, Indian space flight, human spaceflight program, Telugu One]