TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ రాజధానికి మరో వరం: అమరావతిలో వీసా ప్రాసెసింగ్ ఆఫీస్.!

Published on: Thu Sep 24, 2026 9:48AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది.   విదేశీ పౌరుల రాకపోకలు, పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను  సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.  దేశ రాజధాని స్థాయి నగరాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక అధికారాలు, సేవలు అమరావతికి కూడా విస్తరించేలా కేంద్ర హోంశాఖ అమరావతిలో వీసా ప్రాసెసింగ్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు  అఫీషియల్ గా ప్రకటించింది. దీనివల్ల   విదేశీ ప్రయాణాలు లేదా సంబంధిత పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం తప్పనుంది. 

 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విదేశీ ప్రాంతాల రిజిస్ట్రేషన్ కార్యాలయ   సేవలు హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగుతూ వచ్చాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా రాష్ట్రాల పరిధిలోని విదేశీ జాతీయుల రిజిస్ట్రేషన్లు, వీసా పొడిగింపులు, వీసా మార్పులు వంటి అన్ని వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోని  కార్యాలయమే పర్యవేక్షించేది. అయితే..  మారిన  పాలనా అవసరాలు,  ప్రాంతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంశాఖ పాత ఆదేశాలను సవరించింది.  తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా అమరావతి కేంద్రంగా పనిచేసే నూతన ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పరిధిలోకి రానుంది.

ఈ తాజా మార్పుతో దేశంలోనే 13వ ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ కేంద్రంగా అమరావతి రికార్డు సృష్టించింది. ఒక నూతన రాజధానికి  ఈ స్థాయి   అధికారిక కార్యాలయం ఏర్పాటు కావడం  గొప్ప మైలురాయిగా నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యాలయం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, విదేశీ పర్యటనలకు వెళ్లే,  లేదా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారి వీసా ప్రాసెసింగ్ వ్యవహారాలన్నీ అమరావతి కేంద్రంగానే సులభంగా పరిష్కారమవుతాయి.  విద్య, ఉపాధి, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే స్థానిక యువతకు,  ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

గతంలో ఏపీ పౌరులు వీసా సంబంధిత   పనులు,  , ధ్రువీకరణల కోసం, అధికారిక అనుమతుల కోసం హైదరాబాద్‌ లేదా చెన్నై కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. దీనివల్ల   ప్రయాణ ఖర్చులతో పాటు సమయం కూడా వృథా అయ్యేది. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతిలోనే వీసా ప్రాసెసింగ్ కార్యాలయం ఏర్పాటు అవుతోంది.  .

ఏపీ వాసులు ఇక  వీసా ప్రాసెసింగ్ సేవలను నేరుగా అమరావతిలోనే పొందవచ్చు. దీనివల్ల ప్రయాణ భారం పూర్తిగా తగ్గి, పరిపాలనా సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. సాధారణంగా మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమయ్యే ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యాలయాలను సాధించడం అంత సులభం కాదనీ, చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న ప్రాధాన్యత, పలుకుబడి వల్లే  ఇది సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అమరావతిలో వీసా ప్రాసెసింగ్ కార్యాలయం ఏర్పాటుతో అధికారిక పత్రాల జారీ వేగవంతం అవుతుందనీ, దీనివల్ల  అమరావతి కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు   విదేశీ సంస్థలు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉ:దని అంటున్నారు.  మొత్తం మీద విసా ప్రాసెసింగ్ కార్యాలయం ఏర్పాటుతో అమరావతి అభివృద్ధిలో మరో మైలు రాయిని చేరుకున్నట్లైంది.  

[FRRO office, Amaravati,  visa processing office, Visa services,   Union Home Ministry, Notification, AP Capital Amaravathi, Telugu One]