ఏపీలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్!
Published on: Wed Sep 9, 2026 11:58AM

వినాయకచవితి నవరాత్రులను ఘనంగా నిర్వహించుకునేందుకు గణేష్ ఉత్తవ కమిటీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఈ ఏడాది కూడా ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహణ కమిటీలపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా విసయాన్ని మంత్రి నారా లోకేష్ అఫీషియల్ గా ప్రకటించారు. గత ఏడాది కూడా ఏపీ వ్యాప్తంగా గణపతి నవరాత్రి సందర్భంగా గణేష్ మండపాలకు ఏపీ సర్కార్ ఉచిత విద్యుత్ సరఫరా చేసిన సంగతి విదితమే. గత ఏడాది అయితే.. గణపతి ఉత్సవ నిర్వాహకులు స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ణప్తి చేయడంతో అప్పుడు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అడగక ముందే ప్రభుత్వం గణేష్ మండపాలకు విద్యుత్ ను ఉచితంగా నిరంతరాయంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో దుర్గామాత మండపాలకు కూడా ఇదే రీతిలో ఉచిత విద్యుత్ రాయితీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పండగ వాతావరణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రజలంతా సంతోషంగా వేడుకలను జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. సాధారణంగా గణేష్ మండపాలలో విద్యుత్ దీపాలంకరణ, మైకులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం భారీగా కరెంట్ బిల్లులు వస్తుంటాయి. చిన్న కమిటీలు, యువజన సంఘాలు ఈ వ్యయాన్ని భరించడం కష్టంగా మారేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం వల్ల వేలాది మంది ఉత్సవ నిర్వాహకులకు ఎంతో మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులతో నారా లోకేష్ చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించింది. ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల ఉత్సవ కమిటీలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[Free Power For Ganesh Pandals, Andhra Pradesh News, Vinayaka Chavithi, Nara Lokesh ganesh mandapams, Telugu One]


