TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపుపై అధికార, విపక్షాల ధీమా.. యూపీలో బీజేపీకి సవాల్.!

Published on: Fri Oct 23, 2026 9:49AM

దేశంలోని నాలుగు కీలక రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర,  కర్ణాటకలలో ఎంఎల్‌సీ  స్థానాల భర్తీకి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికార పక్షాలకు, ప్రతిపక్ష కూటములకు మధ్య మరోసారి హోరాహోరీ పోరుగా మారుతున్న ఈ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.

ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో, యూపీలో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు (ఐదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు) జరుగుతున్న పోలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార బీజేపీకి,  అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ  మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.  వరుసగా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్న బీజేపీ, తన సంస్థాగత బలాన్ని ఈ ఎన్నికల ద్వారా  పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఎస్పీ, అదే ఊపును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. 

ఇక బిహార్‌లోనూ ఎన్డీఏ కూటమికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ గా మారాయి. రాష్ట్రంలో నాలుగు పట్టభద్రులు, నాలుగు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అధికార కూటమి గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ, ఇటీవలి పరిణామాలు,  కొన్ని అంతర్గత రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి. ముఖ్యంగా పాట్నా గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ తన పార్టీ అభ్యర్థికి కాకుండా స్వతంత్ర/జన్ సూరాజ్ మద్దతుదారుడికి మద్దతు తెలపడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మహారాష్ట్రలోనూ ఐదు ఎమ్మెల్సీ స్థానాల (పుణె, నాగ్‌పూర్, ఛత్రపతి సంభాజీనగర్ పట్టభద్రులు, అలాగే  పుణె, అమరావతి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కోసం పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాన్ని చవిచూసిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కంబ్యాక్ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు మహాయుతి  బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ఈ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుని సత్తా చాటుతామన్న ధీమాతో ఉంది. 

ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ,జేడీఎస్ కూటమికి మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. దక్షిణ, తూర్పు, పశ్చిమ పట్టభద్రుల స్థానాలతో పాటు ఈశాన్య, బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గాల సహా మొత్తం నాలుగు స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. డీకే శివకుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా, విపక్ష కూటమి సమన్వయం ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం, అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఫలితాలు కేవలం శాసనమండలిలో సభ్యుల సంఖ్యాబలాన్ని మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని, రాబోయే రాజకీయ పరిణామాల దిశను కూడా  ప్రతిబింబింస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[Four States MLC elections, BJP NDA UP Bihar Maharashtra, Karnataka MLC polls, National Politics, Telugu One]