వైసీపీకి మరో షాక్.. జనసేనలోకి మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు..?
Published on: Sat Sep 12, 2026 3:52PM

కాకినాడ జిల్లా సామర్లకోట రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ, వారి భర్త గంగిరెడ్డి కృష్ణమూర్తి త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గంగిరెడ్డి కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పనిచేసిన సీనియర్ నాయకులు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ జెండాను మోసిన నాయకుల్లో ఆయన ముందున్నారు. ఆయన సతీమణి అరుణ మున్సిపల్ చైర్మన్‌గా పట్టణంలో మంచి పట్టు సంపాదించారు.

అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొరబాబుతో వ్యక్తిగత విభేదాలు, కొన్ని కారణాల వల్ల వీరిని అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో లేదా స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు 30వ వార్డు మాజీ కౌన్సిలర్ లాయర్ శ్రీను రాజీనామా, మరోవైపు మాజీ చైర్మన్ దంపతులు జనసేనలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలతో సామర్లకోటలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.
[ Former Samarlakota Municipal Chairman Gangireddy Aruna, Gangireddy Krishnamurthy, YSRCP,
Janasena Party, Dora Babu, CM Chandrababu, Naralokesh, Pavan kalyan ]


