TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత.!

Published on: Sun Nov 29, 2026 2:00PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నప్పటికీ, ఇటీవల అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1943 జూన్ 7న గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించిన రాయపాటి సాంబశివరావు, 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన మొత్తం ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో వరుస విజయాలతో సత్తా చాటారు.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, అదే ఏడాది నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

రాజకీయాలతో పాటు వ్యాపార, విద్యా రంగాల్లోనూ రాయపాటి సాంబశివరావు తన సేవలను అందించారు. గుంటూరు ప్రాంతంలో విద్యాసంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు, పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్రం  ప్రాంతీయ అంశాలపై బలమైన గొంతు వినిపించారు.

ఆయన మృతి వార్త తెలియగానే గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ పార్టీల ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రాయపాటి సేవలను స్మరించుకుంటున్నారు.సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన నేతగా, గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ప్రేమ కోసం ఇంటి గడప దాటిన యువతి.. ప్రియుడితో నిఖా, చివరకు పోలీసుల చెంతకు.! 

మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌పై దారుణ దాడి.. తీవ్ర గాయాలు.! 

 

[ Former MP Rayapati Sambasiva Rao passes away, Former MP from Guntur, Former MP from Narasaraopet,Andhra Pradesh Politics, Guntur hospital ]