శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం: దంపతుల అరెస్టు.!
Published on: Sat Oct 24, 2026 1:58PM

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని దాదాపు కోటీ 56 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలిలా ఉన్నాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతడిని అడ్డుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి ట్రాలీ బ్యాగులోని దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో విదేశీ కరెన్సీని దాచిన విషయం బయటపడింది. అతడి వద్ద నుంచి 66 వేల 600 అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 63 లక్షల 62 వేల రూపాయలుగా అంచనా వేశారు.
.webp)
ఈ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, విమానంలో వేరే సీటులో ప్రయాణిస్తున్న అతని భార్య కూడా ఈ అక్రమ రవాణాలో భాగస్వామిగా ఉన్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ సిబ్బంది ఆమెను కూడా అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఆమె లగేజీలోనూ సరిగ్గా అదే పద్ధతిలో దుస్తుల మధ్య దాచిన 97 వేల 600 అమెరికా డాలర్లను గుర్తించారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 91.94 లక్షల రూపాయలని అధికారులు తెలిపారు. ఈ భారీ మొత్తానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి పత్రాలు గానీ, ఆధారాలు గానీ ఆ దంపతుల వద్ద లేకపోవడంతో, కస్టమ్స్ చట్టం ప్రకారం నగదుతో పాటు రవాణాకు ఉపయోగించిన బ్యాగులను సీజ్ చేసిన డిఆర్ఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
[Foriegn Currency Seized Shamshabad Airport, DRI Seizure Hyderabad, Foreign Currency Smuggling, RGIA Airport , Kuala Lumpur Flight, TeluguOne]


