TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షెల్ కంపెనీల ముసుగులో నిధుల మళ్లింపు?

Published on: Tue Aug 25, 2026 4:44PM

భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విదేశీ మారక ద్రవ్య చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ కఠిన  చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశీయంగా ఎలాంటి చెప్పుకోదగ్గ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించని, అత్యల్ప లేదా  జీరో టర్నోవర్ మాత్రమే రికార్డుల్లో చూపుతున్న వందలాది వ్యాపార సంస్థల ద్వారా బిలియన్ల కొద్దీ నిధులు విదేశాలకు బదిలీ కావడం  కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా విదేశాలకు భారీ మొత్తాలను పంపిన దాదాపు 394 అనుమానాస్పద సంస్థలపై  అధికారులు తనిఖీలు ప్రారంభించారు. 

నిధుల మళ్లింపు, మనీలాండరింగ్, పన్ను ఎగవేతతో పాటు మూలధనాన్ని చట్టవిరుద్ధంగా తరలించే యత్నాలు జరిగాయా అనే  కోణంలో  ఆదాయపన్ను అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.  ఈ దర్యాప్తు సంస్థల ప్రధాన దృష్టి సరిహద్దు ప్రాంతాలకు చేరువలో ఉన్న రాష్ట్రాల్లో కొలువుదీరిన కంపెనీలపై కేంద్రీకృతమై ఉంది. పరిశీలనలో ఉన్న 394 సంస్థలలో దాదాపు 117 కంపెనీలు భారత్ సరిహద్దు రాష్ట్రాల నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఇవన్నీ  పేపర్ లేదా షెల్ కంపెనీలుగా అనుమానిస్తున్నారు. కేవలం కంపెనీ యజమానులు లేదా నిర్వహకులే కాకుండా, ఈ విదేశీ చెల్లింపులకు చట్టబద్ధత కల్పిస్తూ ఫారం 15సీబీ ధ్రువపత్రాలను జారీ చేసిన 36 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా పన్ను శాఖ విచారణ పరిధిలోకి వచ్చారు. దీనివల్ల ఈ కేసు కేవలం యజమానుల అవకతవకలకే పరిమితం కాకుండా, రికార్డులను ధృవీకరించే ఆర్థిక నిపుణుల బాధ్యతను కూడా ప్రశ్నించే స్థాయికి చేరింది.  

తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక వ్యవధిలోనే 6 వేల 422 సంస్థలు కలిసి సుమారు  1.29 లక్షల కోట్ల రూపాయల  నిధులను విదేశాలకు బదిలీ చేశాయి. అయితే..  ఈ మొత్తం నిధులలో అత్యధికంగా 72.3 శాతం సొమ్ము సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, మారిషస్, చైనాల వంటి నిర్దిష్ట దేశాలకే చేరడం విశేషం. అందులోనూ సింగపూర్‌కు అత్యధికంగా  41వేల 885 కోట్లు, యూఏఈకి  18 వేల 331 కోట్లు,  హాంకాంగ్‌కు  18 వేల 064 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగాయి. ఈ గమ్యస్థానాలు అంతర్జాతీయ రవాణా, పెట్టుబడులు, వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలైనప్పటికీ, వాస్తవ యాజమాన్యాన్ని దాచిపెట్టి అనుమానాస్పద లావాదేవీలు నెరపడానికి కూడా ఈ మార్గాలను వాడుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సుదూర విదేశీ నిధుల బదిలీల వెనుక ఉన్న అసలు మూలాలు పన్ను శాఖ జరిపిన అంతర్గత సోదాల్లో బయటపడ్డాయి. బోగస్ విరాళాలు, అకామడేషన్ ఎంట్రీలు ఇస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని  ధార్మిక సంస్థలు, ట్రస్టులపై అధికారులు దాడులు నిర్వహించినప్పుడు ఈ నెట్‌వర్క్ గుట్టు రట్టైనట్లు సమాచారం. 

వాస్తవ ఆర్థిక లావాదేవీ జరగకపోయినా, పత్రాలు సృష్టించి అక్రమ నగదును చట్టబద్ధమైన ఆదాయంగా మార్చే ఈ పద్ధతి ద్వారా కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశీ సేవల పేరిట దేశం దాటించినట్లు అనుమానిస్తున్నారు. ఉదాహరణకు, నకిలీ సాఫ్ట్‌వేర్ దిగుమతి, బోగస్ కన్సల్టెన్సీ ఫీజులు లేదా ఊహాజనిత ఫ్రైట్ ఛార్జీల పేరిట రికార్డులను సృష్టించి విదేశాలకు ధనం తరలించి ఉండవచ్చు.  ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగంగా పురోగమిస్తోంది. మొదటి దశలో విరాళాల పేరిట అక్రమ రసీదులు ఇచ్చిన ట్రస్టులపై చర్యలు చేపట్టిన యంత్రాంగం, ఆ తర్వాత లభించిన సమాచారంతో దర్యాప్తు పరిధిని విస్తరించింది. ఇప్పుడు అనుమానాస్పద కంపెనీల బ్యాంకింగ్ నివేదికలు, జీఎస్‌టీ దాఖళ్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, దిగుమతి రికార్డులు, ఇ-మెయిల్ సంభాషణలు, అలాగే డిజిటల్ సాక్ష్యాలను పన్ను శాఖ   సరిపోల్చి చూస్తోంది. 

లావాదేవీలకు సరిపడా ఆదాయం లేకున్నా కోట్ల రూపాయలు బయటకు ఎలా వెళ్లాయనే అంశానికి ఆధారాలతో కూడిన జవాబులను అధికారులు సిద్ధం చేస్తున్నారు.  చట్టపరంగా విదేశాలకు నిధులను తరలించడం నేరం కానప్పటికీ..  దానికి స్పష్టమైన వాణిజ్య కారణం, పన్ను మినహాయింపుల సమ్మతి ఉండాలి. ఫారెక్స్ నియమావళి,  ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిపితే అవి పన్ను ఎగవేత కిందకు వస్తాయి. ఒకవేళ ఇక్కడ సంపాదించిన నేరపూరిత ఆదాయాన్ని విదేశీ కంపెనీల పొరల వెనుక దాచి మళ్లీ దేశంలోకి రప్పిస్తే, అది మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద నేరం.    గతంలో అంటే 2017 లో వేలాది షెల్ కంపెనీలను రద్దు చేయడంతో పాటు, 2023 లోనూ అధిక అనుమానాస్పద విదేశీ బదిలీలపై ఐటీ శాఖ విచారణలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి.  

ఈ రకమైన అక్రమ నిధుల మళ్లింపులు దేశ పన్ను ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, పద్ధతిగా పన్నులు చెల్లించే నిజాయితీగల వ్యాపార సంస్థలను  దెబ్బతీస్తాయి. చట్టబద్ధమైన పద్ధతులను పక్కన పెట్టి, సేవలు పొందకుండానే నిధులు దాటించే కంపెనీలు మార్కెట్‌లో అక్రమ ప్రయోజనాన్ని పొందుతాయి. దీనివల్ల దేశీయంగా నిధుల నిల్వ తగ్గిపోవడమే కాకుండా, ఆర్థిక రంగ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది.కాబట్టి, కేవలం తనిఖీలు చేపట్టడమే కాకుండా, తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన నిపుణులపై, వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడిన కంపెనీల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలు, ఇన్ కమ్ టాక్స్ నెట్‌వర్క్ మరియు ఫారెక్స్ విభాగాలు సమన్వయంతో వ్యవహరించి, నిధులు దేశ సరిహద్దులు దాటక ముందే గుర్తించే ఆధునిక డిజిటల్ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

Foreign remittances, Income Tax Department investigation, shell companies, Form 15CB, money laundering investigation, tax evasion