TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాక్ లో ఆహార సంక్షోభం పీక్స్ కు.. ఆరేళ్లలో రెట్టింపు.!

Published on: Tue Sep 1, 2026 11:09AM

 పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం పీక్స్ కు చేరింది. తీవ్రమైన ఆర్థిక పరిస్థితి కారణంగా.. ఆ దేశంలో ప్రజల మనుగడ దినదిన గండం చందంగా సాగుతోంది. విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న ఆదాయం ఆ దేశాన్ని మునుపెన్నడూ లేనంతగా ఆహార సంక్షోభంలోకి నెట్టేశాయి.  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో  సామాన్యులు తమ రోజువారీ ఆహారపు అలవాట్లను అనివార్యంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పౌష్టికాహారం సంగతి పూర్తిగా మర్చిపోయి కడుపు నింపుకోగలిగితే అదే పదివేలు అన్న పరిస్థితికి వచ్చారు. నాణ్యమైన, పౌష్టికాహారానికి దాదాపుగా దూరమయ్యారు.  

ఈ వివరాలను పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) ఇటీవల విడుదల చేసిన అధికారిక గణాంకాలు విస్పష్టంగా పేర్కొన్నాయి.  పాకిస్థాన్ దుస్థితిని, అక్కడి ప్రజల దయనీయ పరిస్థితిని ఆ గణాంకాలు  కట్టాయి. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే పాలు, మాంసం, బియ్యం, గోధుమలు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల తలసరి వినియోగం అనూహ్య పరిణామానికి క్షీణించింది. అధిక ధరలు భరించలేక సామాన్యులు  బియ్యం, గోధుమలు, మాంసం, పాలు వంటి వాటి కొనుగోలును మరిచిపోయిన పరిస్థితి ఉందన్నది ఆ గణాంకాల సారాంశం. 

పీబీఎస్ గణాంకాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో నెలకు తలసరి గోధుమల వాడకం 7  కిలోలుగా ఉండేది. అది  2024, 25 నాటికి ఇది 6.59 కిలోలకు పడిపోయింది. అదేవిధంగా బియ్యం వినియోగం 1.6 కిలోల నుంచి 0.86 కిలోలకు, పప్పుధాన్యాల వాడకం 0.35 కిలోల నుంచి 0.26 కిలోలకు క్షీణించింది. పేదలకు అతిముఖ్యమైన ఆహారంలో   స్పష్టమైన తగ్గుదలకు ఇదే నిదర్శనం.

అదలా ఉంటే.. మనిషికి అత్యవసరమైన   ప్రొటీన్ ఆధారిత ఆహార వినియోగం మరింతగా క్షీణించింది. ఆరేళ్ల క్రితం ప్రతి ఒక్కరూ నెలకు సగటున 6.85 కిలోల తాజా పాలు వాడగా, ఇప్పుడు అది 6.15 కిలోలకు పరిమితమైంది. ఇక మటన్, బీఫ్, చికెన్ వంటి నాన్ వెజిటేరియన్ వాడకంజజ   0.61 కిలోల నుంచి 0.50 కిలోలకు పడిపోయింది.  కొనుగోలు శక్తి క్షీణతే ఇందుకు కారణమని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

పౌష్టికాహార వాడకం తగ్గుతున్న వేళ..  చౌకగా లభించే వనస్పతి వినియోగం  పెరిగింది. గతంలో నెలకు తలసరి 0.69 కిలోలుగా ఉన్న వనస్పతి వాడకం ఏకంగా 81 శాతం పెరిగి 1.25 కిలోలకు చేరింది. తక్కువ ధరలో లభించి, ఎక్కువ కేలరీలు ఇచ్చే చౌక ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఈ పరిణామాల ఫలితంగా దేశంలో ఆహార అభద్రత ఆందోళనకర స్థాయికి చేరింది.   పస్తులతో అంటే ఆకలితో అలమటించే వారి శాతం ఆరేళ్ల కిందట 2.37శాతం ఉండగా, ఇప్పుడది రెట్టింపు అయ్యింది.  పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ ప్రభావం  మరీ ఎక్కువగా ఉందని ఆ సర్వే తేటతెల్లం చేసింది.  

[Food Crisis in Pakistan Reach Peaks , Pakistan Bureau of Statistics, Food Inflation in Pakistan, Economic Crisis, Malnutrition in Pakistan]