TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమానం హైజాక్ యత్నం: ప్రాణాలు పోతున్నా ప్రయాణీకుల భద్రతకే అంకితం.. ఇండియన్ కెప్టెన్ సాహసం.!

Published on: Fri Oct 2, 2026 6:12PM

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఒక సాధారణ విమాన సర్వీస్‌లో ఊహించని రీతిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా విమానయాన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన,  నాటకీయమైన అత్యవసర పరిస్థితి తలెత్తింది. ప్రయాణికులతో నిండిన ఆ విమానంలో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్‌పై కత్తితో దాడికి పాల్పడటం గగనతలంలో కలకలం రేపింది.

అయితే, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆ ఇండియన్  కెప్టెన్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తి, సాహసం వల్లే వందల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు.   అధికారిక  సమాచారం ప్రకారం, 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోయింగ్ 737 ఎంఏఎక్స్ 8 విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా కో-పైలట్ ఒక్కసారిగా కెప్టెన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 

ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ ఊహించని పరిణామానికి తోడు విమానం ఒక్కసారిగా   కిందకు పడిపోవడం ప్రారంభమైంది. ఫ్లైట్‌రాడార్ డేటా ప్రకారం, విమానం అత్యంత వేగంగా నిలువుగా కిందికి దూసుకెళ్లడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు తారాస్థాయికి చేరాయి.  

ఈ క్లిష్ట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న   కెప్టెన్ స్మిత్ మచ్చర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా కాక్‌పిట్ తలుపును తెరిచే బటన్‌ను నొక్కగలిగారు. ఆయన తీసుకున్న ఈ   నిర్ణయమే విమానంలోని అందరి ప్రాణాలను కాపాడింది. కాక్‌పిట్ తలుపు తెరుచుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది, ధైర్యవంతులైన ప్రయాణికులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపు చేసి  పట్టుకోగలిగారు. ఆ తర్వాత వాయువ్య సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఈ జెట్‌ను అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రాథమిక ల్యాండింగ్ అనంతరం గాయపడిన కెప్గెన్ స్మిత్ మచ్చర్ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.   

ఈ ఉదంతం నేపథ్యంలో విమానయాన భద్రతా ప్రమాణాలు మరియు గతంలోని కొన్ని చారిత్రక సంఘటనల గురించిన చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో జర్మన్‌వింగ్స్ విమాన ప్రమాదంలోనూ కో-పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేసిన ఉదంతాన్ని భద్రతా నిపుణులు గుర్తుచేస్దున్నారు. అయితే ఆ ఘటనకు దీనికి చాలా తేడా ఉందని, ఇక్కడ సహోద్యోగి నుంచి ముప్పు ఎదురైనా, కాక్‌పిట్ లోపల,  బయట ఉన్నవారి సాహసం వల్ల పెను ప్రమాదం తప్పిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇజ్రాయెల్,  యూఏఈ మధ్య కుదిరిన అబ్రహం ఒప్పందాల తర్వాత ఈ మార్గంలో విమాన సర్వీసులు నిత్యం నడుస్తున్నాయి. అయితే విమానంలో విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక,  సెక్యూరిటీ వెట్టింగ్ విధానాలపై ఇప్పుడు పలు దేశాలు  ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.   ముంబైకి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ గతంలో పలు విమానయాన సంస్థల్లో పనిచేసి  అనుభవం గడించారు. ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలను భారత్‌తో పాటు ప్రపంచ దేశాల అధినేతలు ప్రశంసించారు. 

 ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను హీరో  అంటూ కొనియాడారు. మరోవైపు, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఒమన్ దేశస్థుడనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ ఉదంతంపై యూఏఈ అటార్నీ జనరల్ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా..  సౌదీ, ఇజ్రాయెల్ అధికారులు   సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.   ఈ ఘటన రాజకీయంగానూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌‌లో ఎన్నికల వేళ ఈ భద్రతా అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 

నాయకులు దీనిని భద్రతా వైఫల్యాలుగా,  ముప్పుల హెచ్చరికలుగా అభివర్ణిస్తుండగా, మరికొందరు పౌరుల అప్రమత్తతను కొనియాడుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి పలు రకాల వదంతులు, ధృవీకరించని సమాచారం ప్రచారంలోకి రావడంతో సంబంధిత విమానయాన సంస్థ.  అధికార వర్గాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరాయి.   దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఫ్లైదుబాయ్ సంస్థ ఇజ్రాయెల్ రాకపోకలకు సంబంధించిన కొన్ని విమాన సర్వీసులను  సమీక్షిస్తోంది.

ఈ మొత్తం ఉదంతం భవిష్యత్తులో అంతర్జాతీయ విమానయాన భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ విధానాలు, పైలట్ల నియామకపు నేపథ్య పరిశీలన వంటి అంశాలపై విమానయాన రంగం దృష్టి సారించింది. ఏది ఏమైనప్పటికీ, గాలిలో జరిగిన ఆ ప్రమాద సమయంలో కెప్టెన్ ప్రదర్శించిన మనోధైర్యం, ప్రయాణికుల సమిష్టి స్పందన వల్లే 174 మంది ప్రాణాలు సురక్షితంగా నిలబడ్డాయి.   

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Flydubai Incident, Captain Smith Matcher, Dubai Tel Aviv flight,  knife attack, Copilot, Indian pilot saves Passengers, Telugu One]