TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లైదుబాయ్ విమానాన్ని ప్లంబర్ కాపాడాడా.. వైరల్ ప్రచారంపై కెప్టెన్ స్మిత్ మాచర్ క్లారిటీ.!

Published on: Mon Oct 19, 2026 9:38PM

ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడి ఘటనకు సంబంధించి మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. విమానాన్ని ఓ ప్లంబర్ తన సమయస్ఫూర్తితో కాపాడాడంటూ వస్తున్న ప్రచారంపై ఆ విమాన కెప్టెన్ స్మిత్ మాచర్ స్పందించారు. అసలు ఆ ప్లంబర్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం యూఏఈలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఆయన, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కోపైలట్ ఆకస్మిక దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ ఆకస్మికంగా తనపై క్రాష్ యాక్స్‌తో దాడి చేశాడని కెప్టెన్ స్మిత్ మాచర్ వెల్లడించారు. మొదట తనపై ఏదో బరువైన వస్తువు పడిందని భావించానని, ఆ తర్వాత అది తనపై జరుగుతున్న దాడి అని గుర్తించినట్లు తెలిపారు.

దాడి నుంచి తప్పించుకునేందుకు సీట్‌బెల్ట్ విప్పుకుని, చేతులతో దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ ఘటనలో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, రక్తస్రావం జరిగినప్పటికీ ప్రాణాలతో బయటపడేందుకు చివరి వరకు పోరాడానని వివరించారు.

కొంతసేపు స్పృహ కోల్పోయినప్పటికీ, ఎలాగైనా బతకాలని తనకు తాను ధైర్యం చెప్పుకున్నానని స్మిత్ గుర్తుచేసుకున్నారు. తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచి, సహాయం కోసం సిబ్బందిని పిలిచేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే దాడి తర్వాత జరిగిన పరిణామాలన్నీ తనకు పూర్తిగా గుర్తులేవని పేర్కొన్నారు.

ప్లంబర్ విమానాన్ని కాపాడాడా.?

ఈ ఘటన సమయంలో ప్రయాణికుడిగా ఉన్న యానివ్ హయూన్ అనే ప్లంబర్ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడినట్లు కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. విమాన నియంత్రణ వ్యవస్థను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చానని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం విధుల్లో లేని మరో పైలట్ సహాయంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వివరించినట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే, ఈ ప్రచారంపై కెప్టెన్ స్మిత్ మాచర్ స్పష్టతనిచ్చారు. “నిజం చెప్పాలంటే, ఆ ప్లంబర్ గురించి నాకేమీ తెలియదు. విమానంపై దాడి జరిగినప్పుడు, విమానం కూలిపోకుండా చూడటంతో పాటు నన్ను నేను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను” అని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి. విమానం కెప్టెన్ నియంత్రణలోనే ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పిన విషయం మాత్రమే తనకు గుర్తుందని తెలిపారు. ప్లంబర్ విమానాన్ని ల్యాండ్ చేయగలడా? అనే ఊహాగానాలపై తాను వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు.

విమాన భద్రతపై మరోసారి చర్చ.!

ఈ ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎలా స్పందించారనే అంశంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. విమానం తబూక్‌లో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే విమానాన్ని కాపాడటంలో ప్లంబర్ పాత్ర ఎంతవరకు ఉందన్న అంశంపై కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఈ ఘటన నేపథ్యంలో కాక్‌పిట్ భద్రత, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందన, విమాన నియంత్రణ వ్యవస్థల రక్షణ వంటి అంశాలపై మరోసారి దృష్టి పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విమానయాన సంస్థలు భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 

 

[ Flydubai Incident, Smith Machchhar, Indian Pilot, Cockpit Attack, Yaniv Hayun, Plumber Saves Plane Claim, Dubai to Tel Aviv Flight, Tabuk Airport Emergency Landing, Aviation Safety, Telugu News ]