TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లై దుబాయ్: కోపైలెట్ అసలు ఉద్దేశమేంటి.. ప్రాణం అంటే లెక్కలేదన్న నిందితుడు.!

Published on: Mon Oct 5, 2026 9:18AM

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న కాక్‌పిట్ దాడి ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లైట్ ను కూల్చేయడమే కో-పైలట్ హమ్మామ్ అల్ హమ్మామీ ఉద్దేశమా? అంటే దర్యాప్తులో నిందితుడు వెల్లడించిన అంశాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తున్నది.  విమానాన్ని నేలకూల్చి భారీ ప్రాణనష్టం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని, తనకు మరణమంటే ఎలాంటి భయం లేదని అతడు విచారణాధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.   వందల మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొనేందుకు జరిగిన ఈ  యత్నం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. 

 విచారణ సమయంలో హమామ్ అల్-హమ్మామి ఇచ్చిన వాంగ్మూలం అధికారులను సైతం నివ్వెరపోయేలా చేసింది. తాను ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేయాలని ప్లాన్ చేశానని, తనకు మరణం గురించి ఎలాంటి భయం లేదని అతడు నిర్లక్ష్యంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం వెనుక భారీ ఉగ్ర కుట్ర ఉండొచ్చన్న అనుమానాలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా దర్యాప్తును వేగవంతం చేశాయి.

నిందితుడి గతంపై ఆరా తీసిన దర్యాప్తు సంస్థలకు  హమామ్ అల్-హమ్మామి గతంలోనూ తీవ్రవాద భావజాలంతో కూడిన వెబ్‌సైట్లను వీక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అతడు సొంత దేశమైన ఓమాన్‌లో విమానాలు నడపకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

సిరియాలో గడిపిన కాలంలో అతడికి తీవ్రవాద భావాలు అలవడినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అలాంటి వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తి తిరిగి విమానయాన రంగంలోకి ఎలా ప్రవేశించగలిగాడనే దానిపై ఫ్లైదుబాయ్ సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా నిబంధనలను పక్కనబెట్టి నిందితుడికి ఉద్యోగం ఎలా ఇచ్చారనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు.

మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ఉదంతం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడి వెనుక ఏవైనా విదేశీ శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ నిఘా వర్గాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన మార్గాల్లో విమానాలు నడిపే పైలట్ల నియామకం, వారి నేపథ్య పరిశీలనపై అంతర్జాతీయ విమానయాన సంస్థలు మరింత కఠినమైన నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందనిఅంటున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసే చిన్న పొరపాట్లు కూడా ఎంతటి పెను విపత్తుకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.


[Flydubai  Co-pilot Hammam Al Hammami, Flydubai Flight FZ1073, In Flight Assault, Israeli Plane, Cockpit Attack, Flydubai,  Flight security, Telugu One]