నౌకాదళంలో స్వదేశీ సత్తా: విశాఖలో జల ప్రవేశం చేసిన తొలి ఫ్లీట్ సపొర్ట్ షిప్.!
Published on: Tue Oct 6, 2026 9:21AM

భారత రక్షణ రంగంలో స్వదేశీ నౌకల నిర్మాణ సామర్థ్యానికి మరో కీలక మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్1)ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం (అక్టోబర్ 5) జలప్రవేశం చేయించారు. భారత నౌకాదళానికి అవసరమైన దీర్ఘకాలిక సముద్ర కార్యకలాపాలకు ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి. కాగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు హాజరయ్యారు.

భారత నౌకాదళం కోసం హెచ్ఎస్‌ఎల్ మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను నిర్మిస్తోంది. వాటిలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1ను స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే జలప్రవేశం చేయడం ప్రాజెక్టు అమలు వేగానికి నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. 43 వేల 500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలోనే ఇతర యుద్ధనౌకలకు అవసరమైన సరఫరాలను అందిస్తాయి.
ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల ప్రధాన ఉద్దేశం సముద్రంలో సుదీర్ఘకాలం విధుల్లో ఉండే నౌకాదళ యుద్ధనౌకలకు ఇంధనం, నీరు, ఆహారం, మందుగుండు, ఇతర అవసరమైన సామగ్రిని అందించడం. దీనివల్ల యుద్ధనౌకలు తరచూ తీరానికి రావాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళం కార్యకలాపాల పరిధి, సముద్రంలో కొనసాగే సామర్థ్యం పెరుగుతుంది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS5)కు కీల్ లేయింగ్ చేశారు. అంటే ఐదు నౌకల నిర్మాణ ప్రాజెక్టు సిరీస్ ప్రొడక్షన్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ నౌకల నిర్మాణం పూర్తిగా స్వదేశీ డిజైన్‌తో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఒకటి.
ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల నిర్మాణం వల్ల విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. 2024లో ప్రాజెక్టు ప్రారంభమైన సమయంలో హెచ్ఎస్‌ఎల్ అధికారులు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 550 ఎంఎస్ఎంఈలకు వ్యాపార అవకాశాలు, మూడు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే.. విశాఖలో ఎఫ్ఎస్ఎస్ 1 జలప్రవేశం కే ఒక భారీ నౌక నిర్మాణ ఘట్టం మాత్రమే కాదు. భారత నౌకాదళం సముద్ర సామర్థ్యాల విస్తరణకు, దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ బలోపేతానికి నిలువెత్తు నిదర్శనం.
[Fleet Support Ship FSS1, Hindustan Shipyard Limited, Rajnath Singh, Visakhapatnam, Indian Navy, Visakha, Defence Sector, Indigenous Ship Construction, Telugu One]


